source: IPL X
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)లో మార్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రధాన కోచ్, బౌలింగ్ కోచ్‌ను మార్చిన యాజమాన్యం.. తాజాగా బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీతోనూ విడిపోవాలని నిర్ణయించింది. దీంతో ఆ ఫ్రాంచైజీతో హస్సీకి ఉన్న 15 ఏళ్ల అనుబంధం ముగిసింది.
క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. హస్సీని జట్టు నుంచి తప్పిస్తున్న విషయాన్ని సీఎస్‌కే యాజమాన్యం ఇప్పటికే ఆయనకు తెలియజేసింది. ఐపీఎల్ 2027లో మరో ఫ్రాంచైజీ సహాయక సిబ్బందిలో హస్సీ చేరే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని జట్లతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ప్రక్షాళన
సీఎస్‌కేలో కోచింగ్ విభాగం సమూల ప్రక్షాళన జరుగుతుంది. 18 ఏళ్ల పాటు ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో పాటు బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ జట్టును వీడారు. వీరి స్థానాల్లో జహీర్ ఖాన్ ప్రధాన కోచ్‌గా, మోహిత్ శర్మ బౌలింగ్ కోచ్‌గా నియమితులయ్యారు. ఫీల్డింగ్ కోచ్ జేమ్స్ ఫోస్టర్ భవిష్యత్తుపైనా అనిశ్చితి నెలకొంది. హస్సీ స్థానంలో కొత్త బ్యాటింగ్ కోచ్‌గా ఎవరిని నియమిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పై మార్పుల్లో సీఎస్‌కే దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
ఆటగాడిగా, కోచ్‌గా ఐదు టైటిళ్లు
మైఖేల్ హస్సీకి సీఎస్‌కేతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఐపీఎల్ ప్రారంభ సంవత్సరాల్లో జట్టు బ్యాటింగ్‌కు ఆయన కీలక బలంగా నిలిచారు. 2013 సీజన్‌లో ఏకంగా 733 పరుగులు సాధించి సత్తా చాటారు. ఆటగాడిగా సీఎస్‌కే తరఫున రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన హస్సీ.. బ్యాటింగ్ కోచ్‌గా మరో మూడు టైటిళ్ల విజయాల్లో భాగమయ్యారు. మొత్తంగా ఐదు ఐపీఎల్ ట్రోఫీల్లో ఆయన కీలక పాత్ర పోషించారు.
ఇదీ చదవండి: ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్.. బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోర్


