
2008 తర్వాత చెన్నైలో మ్యాచ్ నెగ్గని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
నేడు చెన్నై సూపర్ కింగ్స్‌తో అమీతుమీ
అటు ధోని, ఇటు కోహ్లిపై అందరి కళ్లు
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్‌లో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం చెపాక్ స్టేడియం వేదికగా ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఆడుతుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో చెన్నై జట్టుదే స్పష్టమైన ఆధిక్యం కాగా... చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై బెంగళూరు జట్టు ఒకే ఒక్కసారి విజయం సాధించింది. అది కూడా 17 ఏళ్ల క్రితం.
లీగ్ ఆరంభ సీజన్ (2008)లో చెన్నైలో బెంగళూరు జట్టు గెలుపొందింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడినా అన్నింట్లో ఆర్‌సీబీకి పరాజయమే ఎదురైంది. ఓవరాల్‌గా ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 33 మ్యాచ్‌లు జరగ్గా... అందులో చెన్నై 22 మ్యాచ్‌ల్లో గెలవగా... బెంగళూరు 11 మ్యాచ్‌ల్లో నెగ్గింది. చెన్నైకి ధోని అనుభవం... బెంగళూరుకు విరాట్ కోహ్లి దూకుడే ప్రధాన బలాలు.
వీరిద్దరూ సారథులు కాకపోయినా... జట్టు జయాపజయాలు నిర్ణయించేది మాత్రం ఈ ఇద్దరు పాతకాపులే! చెన్నై పిచ్ స్పిన్‌కు అనుకూలించనున్న నేపథ్యంలో అశ్విన్, రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంపైనే ఆర్‌సీబీ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
స్పిన్నే బలంగా...
బంతి నెమ్మదిగా వచ్చే చెన్నై పిచ్‌పై... స్పిన్నర్లు దట్టంగా ఉన్న సూపర్ కింగ్స్‌ను ఎదుర్కోవడం కష్టమైన పనే. ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లరకు తోడు రచిన్ రవీంద్ర కూడా ఉపయుక్తమైన ఆల్‌రౌండరే కావడం చెన్నైకి మరింత బలాన్నిస్తోంది. ఇక బ్యాటింగ్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, శివమ్ దూబే, స్యామ్ కరన్, జడేజా కీలకం కానున్నారు.
గత మ్యాచ్ చివర్లో క్రీజులోకి దిగిన ధోని... పరుగులేమి చేయకపోయినా ‘తలా’ మైదానంలో అడుగు పెడుతున్న సమయంలో స్టేడియం ‘మోత’ మోగిపోయింది. మరి మహీ బ్యాట్ నుంచి ఆ మెరుపులు చూసే అవకాశం ఈ మ్యాచ్‌లో అయినా అభిమానులకు దక్కుతుందేమో చూడాలి. ముంబైతో ఆడిన తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన సూపర్ కింగ్స్... దాన్నే కొనసాగించాలని చూస్తోంది. బౌలింగ్‌లో మరోసారి నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ కీలకం కానున్నారు.
విరాట్‌పైనే భారం
సీజన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)పై గెలిచి బోణీ కొట్టిన బెంగళూరు దాన్ని కొనసాగించాలని చూస్తోంది. అయితే చెన్నైలో మెరుగైన రికార్డు లేకపోవడం ఆర్‌సీబీని ఇబ్బంది పెడుతోంది. లీగ్ ఆరంభం నుంచి ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ప్లేయర్‌గా చరిత్రతెక్కిన విరాట్ కోహ్లిపైనే బెంగళూరు జట్టు ఎక్కువ ఆధారపడుతోంది.
ఫిల్ సాల్ట్‌తో కలిసి అతడిచ్చే ఆరంభం జట్టుకు ప్రధానం కానుంది. పడిక్కల్, రజత్ పాటీదార్, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్ కృనాల్ పాండ్యా రూపంలో మిడిలార్డర్‌లో మెరుగైన ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగల కోహ్లి ప్రదర్శనపైనే ఆర్‌సీబీ జట్టు ఆశలు పెట్టుకుంది. బౌలింగ్‌లో హాజల్‌వుడ్, యశ్ దయాళ్ కీలకం కానుండగా... గత మ్యాచ్‌లో తిప్పేసిన కృనాల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
తుది జట్లు (అంచనా)
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ (కెప్టెన్), రచిన్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, శివమ్ దూబే, సామ్ కరన్, జడేజా, ధోని, అశ్విన్, ఎలీస్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్), కోహ్లి, సాల్ట్, పడిక్కల్, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్/స్వప్నిల్ సింగ్, హాజల్‌వుడ్, యశ్ దయాళ్, సుయశ్ శర్మ.