RCB Vs GT: బెంగళూరుకు సిరాజ్‌ షాక్‌ | IPL 2025 Royal Challengers Bengaluru Lost To Gujarat Titans By 8 Wickets, Check Out Full Score Details Inside | Sakshi
Sakshi News home page

IPL 2025 RCB Vs GT: బెంగళూరుకు సిరాజ్‌ షాక్‌

Apr 3 2025 4:25 AM | Updated on Apr 3 2025 1:34 PM

Royal Challengers Bangalore lost to Gujarat Titans by 8 wickets

3 వికెట్లతో మెరిసిన గుజరాత్‌ టైటాన్స్‌ పేసర్‌

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు తొలి ఓటమి

8 వికెట్లతో నెగ్గిన గిల్‌ బృందం  

ఏడేళ్ల పాటు బెంగళూరు ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన మొహమ్మద్‌ సిరాజ్‌... తొలిసారి ఆ జట్టుకు ప్రత్యర్థిగా ఆడుతూ నిప్పులు చెరిగాడు. గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున తన పాత సహచరులపై బుల్లెట్‌ బంతులతో ప్రతాపం చూపాడు. ఫలితంగా ఐపీఎల్‌లో టైటాన్స్‌ రెండో విజయం నమోదు చేసుకోగా... రెండు విజయాల తర్వాత బెంగళూరుకు తొలి ఓటమి ఎదురైంది. 

సిరాజ్‌ ధాటికి ఓ మాదిరి స్కోరుకే పరిమితమైన బెంగళూరు జట్టు... ఆ తర్వాత బౌలింగ్‌లో కూడా ఎలాంటి మెరుపులు లేకుండా ఓటమిని ఆహ్వానించింది. బ్యాటింగ్‌లో బట్లర్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో మరో 13 బంతులు మిగిలుండగానే గుజరాత్‌ గెలుపొందింది.  

బెంగళూరు: వరుస విజయాలతో జోరుమీదున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)కు ఐపీఎల్‌ 18వ సీజన్‌లో తొలి ఓటమి ఎదురైంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన బెంగళూరు... బుధవారం జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓటమి పాలైంది. గత సీజన్‌ వరకు ఆర్‌సీబీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్‌ సిరాజ్‌ (3/19) గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున చెలరేగిపోగా... అతడి బౌలింగ్‌ను ఆడలేక బెంగళూరు ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. 

మొదట బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్‌ (40 బంతుల్లో 54; 1 ఫోర్, 5 సిక్స్‌లు) అర్ధశతకం సాధించగా... జితేశ్‌ శర్మ (33; 5 ఫోర్లు, 1 సిక్స్‌), టిమ్‌ డేవిడ్‌ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (7), దేవదత్‌ పడిక్కల్‌ (4) కెప్టెన్ రజత్‌ పాటీదార్‌ (12), ఫిల్‌ సాల్ట్‌ (14), కృనాల్‌ పాండ్యా (5) విఫలమయ్యారు. గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సిరాజ్‌ 3 వికెట్లు, సాయికిషోర్‌ 2 వికెట్లు పడగొట్టారు. 

అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్‌ 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. బట్లర్‌ (39 బంతుల్లో 73 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), సాయి సుదర్శన్‌ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, 1 సిక్స్‌), రూథర్‌ఫోర్డ్‌ (18 బంతుల్లో 30 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు.  

సూపర్‌ సిరాజ్‌... 
టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన  బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. అర్షద్‌ ఖాన్‌ వేసిన రెండో ఓవర్‌లో అనవసర షాట్‌కు యత్నించిన కోహ్లి ఫైన్‌ లెగ్‌లో ప్రసిధ్‌ చేతికి చిక్కాడు. దీంతో చిన్నస్వామి స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. తదుపరి ఓవర్‌లో పడిక్కల్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన సిరాజ్‌ టైటాన్స్‌ ఆనందాన్ని రెట్టింపు చేశాడు. ఇక కొన్ని మంచి షాట్లు ఆడిన సాల్ట్‌ను కూడా సిరాజ్‌ బుట్టలో వేసుకున్నాడు. 

ఈ మధ్య పాటీదార్‌ను ఇషాంత్‌ శర్మ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో... బెంగళూరు జట్టు 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జితేశ్‌ శర్మ, లివింగ్‌స్టోన్‌... చివర్లో డేవిడ్‌ ధాటిగా ఆడారు. 15 ఓవర్లు ముగిసేసరికి 105/6తో ఉన్న ఆర్‌సీబీ... చివరి 5 ఓవర్లలో 64 పరుగులు జోడించింది. రషీద్‌ ఖాన్‌ వేసిన 18వ ఓవర్లో 3 సిక్స్‌లు బాదిన లివింగ్‌స్టోన్‌ను తదుపరి ఓవర్‌లో సిరాజ్‌ అవుట్‌ చేశాడు. చివరి ఓవర్‌లో డేవిడ్‌ 4, 6, 4 కొట్టడంతో బెంగళూరు ఆ మాత్రం స్కోరు చేసింది. 

అలవోకగా... 
ఛేదనలో గుజరాత్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురుకాలేదు. లక్ష్యం చిన్నది కావడంతో ఆ జట్టు ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది. బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేయలేకపోయిన ఆర్‌సీబీ... బౌలింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కెప్టెన్ శుబ్‌మన్‌ గిల్‌ (14) త్వరగానే అవుటైనా... మరో ఓపెనర్‌ సాయి సుదర్శన్‌తో కలిసి బట్లర్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో చెలరేగిన ఈ జంట రెండో వికెట్‌కు 47 బంతుల్లో 75 పరుగులు జతచేసింది. అనంతరం సుదర్శన్‌ అవుట్‌ కాగా... రూథర్‌ఫోర్డ్‌తో కలిసి బట్లర్‌ మూడో వికెట్‌కు 32 బంతుల్లోనే 63 పరుగులు జోడించారు. 

స్కోరు వివరాలు 
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (బి) సిరాజ్‌ 14; కోహ్లి (సి) ప్రసిధ్‌ కృష్ణ (బి) అర్షద్‌ 7; దేవదత్‌ పడిక్కల్‌ (బి) సిరాజ్‌ 4; పాటీదార్‌ (ఎల్బీ) (బి) ఇషాంత్‌ 12; లివింగ్‌స్టోన్‌ (సి) బట్లర్‌ (బి) సిరాజ్‌ 54; జితేశ్‌ శర్మ (సి) తెవాటియా (బి) సాయికిషోర్‌ 33; కృనాల్‌ పాండ్యా (సి అండ్‌ బి) సాయికిషోర్‌ 5; టిమ్‌ డేవిడ్‌ (బి) ప్రసిధ్‌ కృష్ణ 32; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–8, 2–13, 3–35, 4–42, 5–94, 6–104, 7–150, 8–169. బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–19–3; అర్షద్‌ ఖాన్‌ 2–0–17–1; ప్రసిధ్‌ కృష్ణ 4–0–26–1; ఇషాంత్‌ 2–0–27–1; సాయికిషోర్‌ 4–0–22–2; రషీద్‌ ఖాన్‌ 4–0–54–0.  

గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాయి సుదర్శన్‌ (సి) జితేశ్‌ శర్మ (బి) హాజల్‌వుడ్‌ 49; గిల్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) భువనేశ్వర్‌ 14; బట్లర్‌ (నాటౌట్‌) 73; రూథర్‌ఫోర్డ్‌ (నాటౌట్‌) 30; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.5 ఓవర్లలో 2 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–32, 2–107. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–23–1, హాజల్‌వుడ్‌ 3.5–0–43–1; యశ్‌ దయాళ్‌ 3–0–20–0; రసిక్‌ సలామ్‌ 3–0–35–0; కృనాల్‌ పాండ్యా 3–0–34–0; లివింగ్‌స్టోన్‌ 1–0–12–0.  

ఐపీఎల్‌లో నేడు
కోల్‌కతా  X హైదరాబాద్‌
వేదిక: కోల్‌కతా
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement