అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ లియోనెల్ మెస్సీ తన అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 6న బ్యూనస్ ఎయిర్స్ లోని 'మాన్యుమెంటల్ స్టేడియం' వేదికగా బెనిన్‌తో తన చివరి మ్యాచ్ ఆడాడు. ఈ రిటైర్మెంట్ మ్యాచ్‌లో మెస్సీ సంచలన ప్రదర్శన చేశాడు. ఒక గోల్ కొట్టడంతో పాటు రెండు అసిస్ట్‌లు అందించి జట్టును 3-0 తేడాతో విజేతగా నిలిపాడు.
ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం మెస్సీ సోషల్ మీడియా వేదికగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. అర్జెంటీనా జెర్సీని ధరించడాన్ని తాను ఇప్పటికే చాలా మిస్ అవుతున్నానని, తన దేశం కోసం ఆడటం ఎల్లప్పుడూ ఒక గొప్ప గౌరవమని రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా దివంగత ఫుట్‌బాల్ లెజెండ్ డియాగో మారడోనాను కూడా మెస్సీ గుర్తుచేసుకున్నాడు.
మెస్సీ చేసిన ఈ పోస్ట్‌కు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఎంతో భావోద్వేగంగా స్పందించాడు. రొనాల్డో రిప్లై ఇస్తూ.. "లియో, నీ అద్భుతమైన విజయాలతో నీ దేశం అర్జెంటీనాను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లావు. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో నీ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. నువ్వు సాధించిన విజయాలకు అభినందనలు!" అని ప్రశంసల వర్షం కురిపించాడు.
మైదానంలో ప్రత్యర్థులుగా పోటీపడే వీరిద్దరూ, ఆఫ్ ది ఫీల్డ్‌లో మంచి స్నేహితులుగా ఉండటం అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది. మెస్సీ సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అద్భుత విజయాలు ఉన్నాయి. ఖతార్ వేదికగా జరిగిన 2022 ఫిఫా వరల్డ్ కప్‌లో అర్జెంటీనా జట్టును మెస్సీ విజేతగా నిలిపాడు. అంతేకాకుడా 2021, 2024లో రెండు కోపా అమెరికా టైటిళ్లతో పాటు 2022 ఫైనలిస్సిమా టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు.


