
న్యూఢిల్లీ: స్వదేశంలో అభిమానుల మద్దతుతో వన్డే వరల్డ్ కప్ గెలవగలమని భారత కెప్టెన్ రోహిత్ శర్మ విశ్వాసం వ్యక్తం చేశాడు. గత రెండు ప్రయత్నాల్లో తాము ట్రోఫీకి దూరమైనా... ఈసారి 2011 ప్రదర్శనను పునరావృతం చేస్తామని అతను అన్నాడు. ఎమ్మెస్ ధోని నాయకత్వంలో 2011లో గెలిచిన భారత జట్టులో రోహిత్ శర్మ సభ్యుడు కాదు. ఆ తర్వాత 2015, 2019లలో అతను ఆడిన సందర్భాల్లో టీమ్ సెమీఫైనల్ చేరింది.
పుష్కరకాలం క్రితంలాగే ఈసారి సొంతగడ్డపై అభిమానుల మద్దతు తమకు అదనపు బలం అవుతుందని అతను అభిప్రాయపడ్డాడు. "భారత జట్టు ఏ వేదికపై ఆడేందుకు వెళ్లినా పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ అండగా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. 12 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్‌లో వన్డే వరల్డ్ కప్ జరుగుతోంది. 2016 టి20 ప్రపంచకప్ జరిగినా వన్డే టోర్నీ ప్రత్యేకత వేరు. అభిమానులు ఎంతో ఉత్సాహంగా టోర్నీ కోసం ఎదురు చూస్తున్నారు.
నేను ఇంత దగ్గరగా మొదటిసారి ట్రోఫీని చూస్తున్నాను. ఈసారి విజేతగా అందుకోవాలని కోరుకుంటున్నా" అని రోహిత్ వ్యాఖ్యానించాడు. అమెరికాలో ఐసీసీ ప్రపంచకప్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ ఈ సందర్భంగా టోర్నీని సంబంధించి తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు. ‘2003లో సచిన్ అద్భుతంగా ఆడటంతోపాటు భారత్ ఫైనల్ వరకు చేరడం, 2007లో మన జట్టు విఫలం కావడం గుర్తున్నాయి. 2011కు సంబంధించి ఆనందం, బాధ ఉన్నాయి. నేను లేకపోవడంతో ఒకదశలో మ్యాచ్‌లు చూడవద్దని అనుకున్నా. కానీ తర్వాత చూశా. మన జట్టు క్వార్టర్స్ నుంచి చాలా బాగా ఆడింది. ఇక సభ్యుడిగా రెండు టోర్నీల్లో భాగమయ్యా’ అని రోహిత్ చెప్పాడు.
చదవండి: World Cup 2023: ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడిపై వేటు! యువ ఆటగాళ్లు ఎంట్రీ