టీ20 ప్రపంచకప్-2026కు భారత్, శ్రీలంక వేదికలగా మరో 20 రోజుల్లో తెరలేవనుంది. అయితే ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. రిషబ్ పంత్ ప్రస్తుతం టీ20 ప్రణాళికల్లో లేకపోయినప్పటికి.. స్క్వాడ్‌లో ఉన్న తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ గాయాలు ఇప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారాయి.
ప్రపంచకప్ ఆరంభ సమయానికి తిలక్ కోలుకునే అవకాశమున్నప్పటికి.. వాషింగ్టన్ అందుబాటుపై మాత్రం సందిగ్ధం నెలకొంది. సుందర్ ప్రస్తుతం ప్రక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతడు కివీస్‌తో టీ20 సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.
వాషీ కోలుకోవడానికి దాదాపు ఐదు వారాల సమయం పట్టనునున్నట్లు తెలుస్తోంది. అతడు పొట్టి ప్రపంచకప్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నాడు. అతడి అందుబాటుపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ త్వరలోనే ఓ ప్రకటన చేసే అవకాశముంది.
వరల్డ్‌కప్ జట్టులోకి పరాగ్..
మరోవైపు వాషింగ్టన్ సుందర్‌కు ప్రత్యామ్నాయంగా ఎవరిని తీసుకోవాలన్నదానిపై సెలెక్టర్లు కసరత్తలు మొదలు పెట్టినట్లు సమాచారం. అస్సాం స్టార్ ప్లేయర్ రియాన్ పరాగ్‌ను వరల్డ్‌కప్ జట్టులోకి తీసుకోవాలని అజిత్ అగార్కర్ భావిస్తున్నట్లు సమాచారం.
హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతు కూడా పరాగ్‌కు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శనల కారణంగా పరాగ్ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. శ్రీలంక పర్యటనలో పరాగ్ ఆల్‌రౌండర్‌గా మెప్పించాడు. బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణించాడు.
లంకతో ఓ టీ20 మ్యాచ్‌లో కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం వన్డే మ్యాచ్‌లో కూడా 9 ఓవర్లు బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు సాధించాడు. ఈ పర్యటన ద్వారా రియాన్ కేవలం బ్యాటర్ మాత్రమే కాదు, కీలక సమయాల్లో వికెట్లు తీయగలే సత్తా ఉంది అని నిరూపించుకున్నాడు.
అయితే ఆ తర్వాత భుజం గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. రియాన్ ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఉన్నాడు. అతడు దాదాపు పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు సమాచారం. పరాగ్ బ్యాట్‌తో మెరుపులు మెరిపించగలడు.. బంతితో అద్భుతాలు కూడా చేయగలడు. కాబట్టి చాలా మంది మాజీలు వాషీకి సరైన ప్రత్యామ్నాయం రియాన్ అని అభిప్రాయపడుతున్నారు.
చదవండి: కనీసం మూడో మ్యాచ్‌లోనైనా ఆడించండి: అశ్విన్


