ఓ వైపు గాయం.. అయినా విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌! శెభాష్ రిష‌బ్ | Rishabh Pants super performance despite suffering from injury | Sakshi
Sakshi News home page

IND vs ENG: ఓ వైపు గాయం.. అయినా విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌! శెభాష్ రిష‌బ్

Jul 12 2025 6:02 PM | Updated on Jul 12 2025 7:41 PM

Rishabh Pants super performance despite suffering from injury

ఓ వైపు తీవ్ర‌మైన‌ గాయం.. అయినా నేను ఉన్నా అంటూ బ్యాట్ ప‌ట్టుకుని మైదానంలోకి వ‌చ్చాడు. అత‌డికి త‌న గాయం కంటే జ‌ట్టు గెల‌వ‌డ‌మే ముఖ్యం. తన విరోచిత పోరాటంతో క‌ష్టాల్లో ఉన్న జ‌ట్టును ఆదుకున్నాడు. గాయంతో పోరాడుతూనే జ‌ట్టు స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. చేతి వేలి నొప్పితో బాధపడుతూనే ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. అత‌డే టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్‌. 

లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టులో పంత్ అద్భుత‌మైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 112 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 74 పరుగులు చేశాడు. ఓ దశలో సునాయసంగా సెంచరీ మార్క్‌ను అందుకునేటట్లు కన్పించిన పంత్.. దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. 

గాయాన్ని లెక్కచేయ‌ని పంత్‌..
తొలి రోజు ఆట సంద‌ర్బంగా పంత్ ఎడ‌మ చేతి వేలికి గాయ‌మైంది. దీంతో అతడు మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. రెండో రోజు ఆటలో కూడా పంత్ ఫీల్డింగ్‌కు రాలేదు. అత‌డి స్ధానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీప‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు. ఆ త‌ర్వాత ప్రాక్టీస్‌లో కూడా పంత్ చేతి వేలి నొప్పితో బాధ‌ప‌డుతూ క‌న్పించాడు. 

దీంతో అత‌డు బ్యాటింగ్‌కు వ‌స్తాడా రాడా? అన్న సందేహం అంద‌రిలోనూ నెలకొంది. కానీ పంత్ మాత్రం త‌న గాయాన్ని సైతం లెక్క చేయ‌కుండా బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. అప్ప‌టికే జైశ్వాల్‌, గిల్ వికెట్ల‌ను కోల్పోయిన భార‌త జ‌ట్టును పంత్ ఆదుకున్నాడు. కేఎల్ రాహుల్‌తో క‌లిసి స్కోర్ బోర్డును ముందుకు న‌డిపించాడు. 

రాహ‌ల్‌లో క‌లిసి నాలుగో వికెట్‌కు 141 ప‌రుగుల కీల‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. కానీ అద్బుతంగా ఆడుతున్న స‌మ‌యంలో ర‌నౌట్ రూపంలో పంత్ మైదానం వీడాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో పంత్‌పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. శెభాష్ రిష‌బ్ అంటూ కొనియాడుతున్నారు.

సెంచ‌రీకి చేరువ‌లో రాహుల్‌..
మూడో రోజు లంచ్ విరామ స‌మ‌యానికి భార‌త్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల న‌ష్టానికి 248 ప‌రుగులు చేసింది. భార‌త్ ఇంకా ఇంగ్లండ్ కంటే 139 ప‌రుగుల వెన‌కంజ‌లో ఉంది. ప్ర‌స్తుతం క్రీజులో కేఎల్ రాహుల్‌(98) సెంచ‌రీకి చేరువ‌లో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement