source: X
రంజీ ట్రోఫీ 2026-27లో ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న టీమిండియా ఆటగాడు రింకూ సింగ్ సెంచరీతో కదంతొక్కాడు. బిహార్‌తో ఇవాళ మొదలైన ఎలైట్ గ్రూప్-ఏ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఉత్తర్‌ప్రదేశ్ తొలుత బ్యాటింగ్ చేస్తుండగా.. రింకూ తొలి రోజే మూడంకెల మార్కును తాకాడు. 164 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
మరో యూపీ ఆటగాడు మాధవ్ కౌశిక్ (124 నాటౌట్) అజేయ సెంచరీతో రింకూకు జతగా క్రీజ్‌లో ఉన్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి యూపీ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 287గా ఉంది. అభిషేక్ గోస్వామి (13), కెప్టెన్ ఆర్మన్ జుయల్ (13), కరణ్ శర్మ (13) ఔటయ్యారు. బిహార్ బౌలర్లలో సూరజ్ కశ్యప్ 2, అమోద్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టారు.
కాగా, రింకూ ప్రస్తుతం ఏ ఫార్మాట్‌లోనూ భారత జట్టులో లేడు. కొద్ది రోజుల కిందట టీ20 జట్టులో స్థానం కోల్పోయిన అతడు రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్యలో దేశవాలీ క్రికెట్‌లో రాణిస్తున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రింకూ చాపకింద నీరులా ప్రవహిస్తున్నాడు.
ఈ ఫార్మాట్‌లో అతడు 77 ఇన్నింగ్స్‌ల్లో 10 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు బాదాడు. తాజా ప్రదర్శనలతో రింకూ మరోసారి భారత సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించాడు. రింకూ ప్రస్తుతం భారత-ఏ జట్టులోనూ స్థానానికి నోచుకోలేదు. త్వరలో న్యూజిలాండ్‌లో పర్యటించబోయే ఏ జట్టులో కూడా రింకూకు చోటు దక్కలేదు.
ఇదీ చదవండి: రీఎంట్రీలో సూర్యకుమార్ అట్టర్ ప్లాప్


