
ఐపీఎల్-2025 సీజన్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆసాధరణ ప్రదర్శన కనబరిచింది. సోమవారం ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ క్వాలిఫయర్-1కు ఆర్హత సాధించింది. లక్నో నిర్ధేశించిన 228 పరుగుల భారీ లక్ష్యాన్ని బెంగళూరు కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది.
ఆర్సీబీ బ్యాటర్లలో స్టాండ్ ఇన్ కెప్టెన్ జితేష్ శర్మ(33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 85 నాటౌట్) విధ్వంసం సృష్టించగా.. విరాట్ కోహ్లి(30 బంతుల్లో 10 ఫోర్లతో 54), మయాంక్ అగర్వాల్(23 బంతుల్లో 41 నాటౌట్), సాల్ట్(30) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో విలియం ఓ రూర్క్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆకాష్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) సీజన్‌లో తొలి సెంచరీతో చెలరేగగా, మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో మెరిశాడు.
ఆర్సీబీ సరికొత్త చరిత్ర..
ఇక ఈ మ్యాచ్‌లో అద్బుత విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఒక ఐపీఎల్ సీజన్‌లో ప్రత్యర్ధి జట్లతో వాటి హోం గ్రౌండ్స్‌లో జరిగిన అన్నీ మ్యాచ్‌లలోనూ గెలుపొందిన తొలి టీమ్‌గా ఆర్సీబీ చరిత్ర సృష్టించింది.
ఈ ఏడాది సీజన్ తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్‌ను ఓడించిన ఆర్సీబీ.. ఆ తర్వాత సీఎస్‌కే, ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌ను వారి సొంత మైదానాల్లోనే చిత్తు చేసింది.
చదవండి: IND vs ENG: బీసీసీఐ కీలక నిర్ణయం.. దిలీప్‌కు మళ్లీ పిలుపు