నేను ట్రోఫీలు గెలుస్తాను.. టెస్టుల్లో ఏం తక్కువైంది?: గంభీర్‌ | Rankings Don't Matter: Gambhir Rejects India Is Struggling In Tests | Sakshi
Sakshi News home page

నేను ట్రోఫీలు గెలుస్తాను.. టెస్టుల్లో ఏం తక్కువైంది?: గంభీర్‌

Aug 22 2026 4:14 PM | Updated on Aug 22 2026 4:24 PM

Rankings Don't Matter: Gambhir Rejects India Is Struggling In Tests

టీమిండియా టెస్టు కెప్టెన్‌ గిల్‌తో గంభీర్‌ (PC: BCCI X)

టెస్టు ఫార్మాట్‌లో వైఫల్యాల నేపథ్యంలో వస్తున్న విమర్శలపై టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ స్పందించాడు. తాను ట్రోఫీలు గెలిచేందుకు మాత్రమే పని చేస్తానని స్పష్టం చేశాడు. తనకు ర్యాంకులు ముఖ్యం కాదని.. జట్టు సంధి దశలో ఉన్నపుడు ఒక్కోసారి ఆశించిన ఫలితాలు రావని పేర్కొన్నాడు.

ఘోర పరాభవాలు
కాగా గంభీర్‌ మార్గదర్శనంలో టీమిండియా వైట్‌బాల్‌ క్రికెట్‌లో మంచి ఫలితాలు సాధించినప్పటికీ.. టెస్టుల్లో మాత్రం ఇప్పటికే ఘోర పరాభవాలు చవిచూసింది. స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో తొట్టతొలిసారి 3-0తో వైట్‌వాష్‌ కావడం, పాతికేళ్ల తర్వాత తొలిసారి సొంతగడ్డపై సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్‌ కావడం ఇందులో ముఖ్యమైనవి.

అయితే, ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఏదేమైనా గంభీర్‌పై మాత్రం విమర్శలు ఆగటం లేదు. ఇక ఇటీవల స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో టెస్టు మ్యాచ్‌ గెలిచిన టీమిండియా.. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో గెలిచింది.

ఫైనల్‌ రేసులో ఉండాలంటే.. 
అయితే, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27లో ఫైనల్‌ రేసులో ఉండాలంటే.. శ్రీలంకపై రెండో టెస్టు కూడా గెలవడంతో పాటు.. తర్వాత న్యూజిలాండ్‌ గడ్డమీదా సత్తా చాటాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో శ్రీలంకతో భారత్‌ రెండో టెస్టుకు ముందు రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడిన గంభీర్‌.. తనపై వస్తున్న విమర్శలపై స్పందించాడు.

ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యం
‘‘ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యం. వ్యూస్‌, లైక్స్‌ కోసం నేను పనిచేయను. నా అభిప్రాయంలో ర్యాంకింగ్స్‌ కూడా పెద్ద విశేషమేమీ కాదు. ప్రస్తుతం మా జట్టు సంధి దశలో ఉంది. యువ ఆటగాళ్లు వస్తున్నారు. ఈ విషయం కామెంట్రీ బాక్స్‌, మీడియా బాక్స్‌లో కూర్చున్న వాళ్లకు కూడా తెలుసు.

ఆటలో గెలుపుఓటములు, ఎత్తుపళ్లాలు సహజం. ఇంగ్లండ్‌లో గతేడాది మేము మెరుగ్గా ఆడినాము. మా ఆటలో నిలకడ ఉంది. మేము సరైన దిశలోనే వెళ్తున్నాము’’ అని గంభీర్‌ అన్నాడు. అదే విధంగా.. టెస్టు సిరీస్‌లో కనీసం మూడు మ్యాచ్‌లు ఉంటే బాగుంటుందని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. తద్వారా తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు.. మిగిలిన రెండింటిలో ఒక్కటి గెలిచి, ఒకటి డ్రా చేసుకున్నా బాగుంటుందన్నాడు. 

కాగా శ్రీలంక- భారత్‌ మధ్య ఆదివారం నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఇందుకు కొలంబోలోని సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ వేదిక. ఇదిలా ఉంటే.. గంభీర్‌ మార్గదర్శనంలో టీమిండియా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్‌-2026 టైటిళ్లు గెలిచింది. కానీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌-2025 ఫైనల్‌కు మాత్రం చేరలేకపోయింది.

చదవండి: స్టార్క్‌ సరికొత్త చరిత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement