సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు తమ బిజీ హోమ్ సీజన్ ముందు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ పేసర్ కగిసో రబాడ తొడ కండరాల గాయం బారిన పడ్డాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా ఓ స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. ఈ శిక్షణలో భాగంగానే రబాడ కుడి తొడ కండరాలు పట్టేశాయి.
దీంతో అతడు ప్రాక్టీస్ మధ్యలో వైదొలిగాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా అధికారికంగా ధ్రువీకరించింది. రబాడ ప్రస్తుతం వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని, తన గాయానికి సంబంధించి అన్ని రకాల పరీక్షలు నిర్వహించనున్నామని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. సెప్టెంబర్ నుంచి దక్షిణాఫ్రికా సొంతగడ్డపై సుదీర్ఘమైన హోమ్ సీజన్‌లో పాల్గొననుంది.
ప్రోటీస్ జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో పాటు బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లతో సిరీస్‌లు ఆడాల్సి ఉంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను రిటైన్ చేసుకోవాలని భావిస్తున్న సౌతాఫ్రికాకు రబాడ ఫిట్‌నెస్ ఎంతో కీలకం. డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో భాగంగా బవుమా సేన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లు ఆడనుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఈ రెండు సిరీస్‌లలో సఫారీలు తప్పక గెలవాల్సిందే. ఇప్పటికే వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా నమీబియాతో జరగబోయే టి20 ట్రై-సిరీస్, వన్డేలకు ఇప్పటికే టెంబా బవుమాకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.
గతేదాది ఆఖరిలో కూడా భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు రబాడ ప్రక్కటెముకల గాయంతో దూరమయ్యాడు. మళ్లీ ఇప్పుడు కీలక సిరీస్‌లకు ముందు రబాడ గాయం పడడం జట్టు మేనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. అక్టోబర్ 9 నుంచి సౌతాఫ్రికా-ఆసీస్ మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ సమయానికి రబాడ కోలుకోకపోతే ప్రోటీస్‌కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పుకోవాలి.
చదవండి: BAN vs AUS: చేసింది 14 పరుగులే.. అయినా ప్రపంచ రికార్డు


