ప్రాచీన మానవ జాతుల శిలాజం.. 20 లక్షల ఏళ్ల రహస్యం | 2 million year old fossil confirms Homo erectus lived | Sakshi
Sakshi News home page

ప్రాచీన మానవ జాతుల శిలాజం.. 20 లక్షల ఏళ్ల రహస్యం

Oct 3 2026 9:21 PM | Updated on Oct 3 2026 9:29 PM

2 million year old fossil confirms Homo erectus lived

దక్షిణాఫ్రికాలోని డ్రిమోలెన్ మెయిన్ క్వారీ నుంచి ఇంతకుముందు శాస్త్రీయంగా ప్రచురించని 18 ప్రాచీన మానవ జాతుల (మానవ పరిణామంలో భాగమైన ప్రాచీన జాతులు) శిలాజాలను పరిశోధకులు వివరించారు. ప్రాచీన మానవ జాతులు అంటే మనుషుల పరిణామ క్రమంలో మనకు ముందు జీవించిన, మనుషులతో పరిణామ పరంగా సంబంధం ఉన్న ప్రాచీన జీవులు. 

సింపుల్‌గా చెప్పాలంటే.. హోమో ఎరెక్టస్ వంటి ప్రాచీన మానవ జాతులు మానవ పరిణామ చరిత్రలో భాగం. వీరు నేటి మనుషులు (హోమో సేపియన్స్) కాదు. అయితే శరీర నిర్మాణం, నడక, మెదడు అభివృద్ధి వంటి అంశాల్లో ఆధునిక మనుషులతో పరిణామ సంబంధం ఉంది. వీరి ఎముకలు, పళ్ల శిలాజాలను అధ్యయనం చేయడం ద్వారా మనిషి ఎలా పరిణామం చెందాడో శాస్త్రవేత్తలు తెలుసుకుంటారు.

ఆ 18 ప్రాచీన మానవ జాతుల శిలాజాల్లో 20 లక్షల ఏళ్ల నాటి వయోజన హోమో ఎరెక్టస్ శిలాజం కూడా ఉంది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఇప్పటివరకు గుర్తించిన వయోజన హోమో ఎరెక్టస్ శిలాజాల కంటే ఇది సుమారు 2 లక్షల ఏళ్లు పాతది. ఈ శిలాజాలు దక్షిణాఫ్రికాలోని ‘క్రేడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’లో భాగమైన డ్రిమోలెన్ మెయిన్ క్వారీలో బయటపడ్డాయి.

ఈ ప్రాంతాన్ని 1992లో గుర్తించారు. 2019 వరకు అక్కడ శిలాజాల తవ్వకాలు జరిగాయి. అయితే అనేక శిలాజాలు శాస్త్రీయంగా ప్రచురితం కాకపోవడంతో వాటి గురించి పరిశోధకులకు పూర్తి సమాచారం అందుబాటులో లేదు. ఇప్పుడు లా ట్రోబ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు దక్షిణాఫ్రికా, అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలతో కలిసి మరో 18 శిలాజాలను వివరించారు. వీటిని హోమో ఎరెక్టస్, పరాంథ్రోపస్ రోబస్టస్ అనే రెండు మానవ పూర్వీకుల జాతులకు చెందినవిగా గుర్తించారు.

వాటిలో డీఎన్‌హెచ్ 127గా గుర్తించినది వయోజన హోమో ఎరెక్టస్ శిలాజం. దీని వయసు 20 లక్షల ఏళ్లుగా నిర్ధారించారు. ఇంతకుముందు డ్రిమోలెన్‌లో లభించిన డీఎన్‌హెచ్ 134 శిలాజం 2 నుంచి 4 ఏళ్ల వయసున్న చిన్నారికి చెందినదిగా అంచనా వేశారు. కొత్త వయోజన శిలాజం అదే ప్రాంతం, అదే కాలానికి చెందిన హోమో ఎరెక్టస్ పెద్ద రూపం ఎలా ఉండేదో తెలుసుకునేందుకు ఆధారాన్ని అందించింది. పరిశోధకుల ప్రకారం, దక్షిణాఫ్రికాలోనే ఈ జాతి సుమారు 20 లక్షల ఏళ్ల క్రితం ఉద్భవించిందనే ఆధారాన్ని ఇది మరింత బలపరుస్తోంది.

అదే ప్రాంతంలో లభించిన పరాంథ్రోపస్ రోబస్టస్ శిలాజాలు కూడా 20 లక్షల నుంచి 18 లక్షల ఏళ్ల మధ్య పరిణామ మార్పులను చూపించాయి. ఈ కాలంలో వాటి దంతాలు పెద్దవిగా మారడంతో పాటు నమలడానికి ఉపయోగించే కండరాలు కూడా అభివృద్ధి చెందినట్లు పరిశోధకులు గుర్తించారు. భవిష్యత్ పరిశోధనల్లో ఈ శిలాజాలు మానవ పూర్వీకుల పరిణామ క్రమంలోని చిన్నచిన్న మార్పులను మరింత స్పష్టంగా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement