PC: BCCI X
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ను ఉద్దేశించి భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటు విమర్శలు చేశాడు. శ్రీలంకలో గంభీర్‌కు పనీపాటా లేకుండా పోయిందని.. అతడు అక్కడ ఉండటం దండగేనన్నాడు. కాగా రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ శ్రీలంకను 165 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసులో మరో ముందుడుగు వేసింది.
బారీ శతకంతో విజయానికి పునాది
ఇక టీమిండియా విజయంలో దేవదత్ పడిక్కల్ కీలక పాత్ర పోషించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం (167) సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 44 విలువైన పరుగులు జతచేశాడు. కాగా సాయి సుదర్శన్ గాయపడటం వల్లే పడిక్కల్‌కు తుదిజట్టులో చోటు సాధ్యమైంది.
ఇక సాయి సుదర్శన్‌కు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మద్దతు ఉందన్న సంగతి తెలిసిందే. గతంలో వరుస మ్యాచ్‌లలో విఫలమైనప్పటికీ సుదీర్ఘకాలం పాటు.. టెస్టుల్లో వన్‌డౌన్‌లో వచ్చేది సుదర్శన్ మాత్రమేనని గంభీర్ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో పడిక్కల్ తాజా ప్రదర్శనను ఉదాహరిస్తూ క్రిష్ణమాచారి శ్రీకాంత్ గంభీర్‌పై విరుచుకుపడ్డాడు.
పడిక్కల్‌ను రీప్లేస్ చేస్తారా?.. గంభీర్‌కు పనీపాటా లేదు!
తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘మొదటి టెస్టులో పడిక్కల్ 200కు పైగా పరుగులు స్కోరు చేశాడు. అయినా సరే పడిక్కల్ స్థానంలో సుదర్శన్‌ను ఆడిస్తావా గంభీర్?.. అయినా గంభీర్‌కు శ్రీలంకలో పనేమీ లేదు.
శ్రీలంక జట్టు అస్సలు బాలేదు. వాళ్లపై టీమిండియా తప్పకుండా గెలుస్తుంది. ఇక ఆ తర్వాత గంభీర్ ఎగిరి గంతేస్తాడు. శ్రీలంక, అఫ్గానిస్తాన్ జట్లపై విజయానికే అతడు సంతోషిస్తాడు. నేను గంభీర్‌ను ఘాటుగా విమర్శించాలనుకోవడం లేదు.
గంభీర్ మంచి ప్లేయర్.. కానీ
నిజానికి అతడు మంచి క్రికెటర్. ఆటను చాలా బాగా అర్థం చేసుకుంటాడు. కానీ ఇతరులతో మాట్లాడేటపుడే కాస్త ఇబ్బంది. అందుకే ఆటగాడిగా ఆకట్టుకున్నా.. కోచ్‌గా మాత్రం అతడు ఇబ్బందిపడుతున్నట్లు అనిపిస్తుంది’’ అని చిక్కా అన్నాడు. కాగా ఇటీవల స్వదేశంలో అఫ్గాన్‌తో ఒక టెస్టు మ్యాచ్ ఆడిన టీమిండియా గెలుపుజెండా ఎగురవేసింది.
అయితే, అంతకు ముందు సౌతాఫ్రికా చేతిలో సొంతడ్డపై 0-2తో భారత్ వైట్‌వాష్‌కు గురైంది. పాతికేళ్ల తర్వాత ఇంతటి ఘోర పరాభవం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. భారత్- శ్రీలంక మధ్య ఆదివారం రెండో టెస్టు మొదలుకానుండగా.. కొలంబో ఇందుకు వేదిక.


