చెలరేగిన ఓపెనర్లు.. సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా | India women beat Zimbabwe in 2nd T20I and Clinches the series | Sakshi
Sakshi News home page

చెలరేగిన ఓపెనర్లు.. సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా

Oct 18 2026 9:30 PM | Updated on Oct 18 2026 9:30 PM

India women beat Zimbabwe in 2nd T20I and Clinches the series

source: X

స్వదేశంలో జింబాబ్వే మహిళల జట్టుతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత మహిళల జట్టు మరో మ్యాచ్‌ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ గెలిచిన టీమిండియా.. రాయ్‌పూర్‌ వేదికగా ఇవాళ జరిగిన రెండో మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేయగా.. ఓపెనర్లు షఫాలీ వర్మ (55), స్మృతి మంధన (47 నాటౌట్‌) చెలరేగడంతో భారత్‌ సునాయాస విజయం సాధించింది.

రాణించిన భారత బౌలర్లు
ఈ మ్యాచ్‌లో తొలుత భారత బౌలర్లు రాణించారు. నికీ ప్రసాద్‌ 2, క్రాంతి గౌడ్‌, నందిని శర్మ, దీప్తి శర్మ, శ్రీ చరణి తలో వికెట్‌ తీసి జింబాబ్వేను కట్టడి చేశారు. వారి ఇన్నింగ్స్‌లో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. టిరిపానో 34, కెప్టెన్‌ నకోమో 27 (నాటౌట్‌) పరుగులు చేశారు. వారి ఇన్నింగ్స్‌లో ముగ్గురు డకౌట్లు కాగా.. మిగతా వార​ంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

ఊదేసిన ఓపెనర్లు
స్వల్ప లక్ష్యాన్ని భారత ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధన ఆడుతూ పాడుతూ ఊదేశారు. షఫాలీ గెలుపు వాకిట ఔట్‌ కాగా.. అనుష్క శర్మ (1 నాటౌట్‌) సహకారంతో మంధన భారత్‌ను విజయతీరాలకు చేర్చింది. భారత్‌ కేవలం​ 8.5 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ సిరీస్‌లోని నామామాత్రపు చివరి టీ20 ఇదే రాయ్‌పూర్‌ వేదికగా అక్టోబర్‌ 20న జరుగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ప్రారంభమవుతుంది. వన్డే మ్యాచ్‌లు అక్టోబర్‌ 23, 25, 28 తేదీల్లో జరుగనున్నాయి.

ఇదీ చదవండి: ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియా విజయం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement