‘ఛాన్స్‌ ఇవ్వొద్దని భీష్మించుకున్నారు.. వాటర్‌ బాటిళ్లు మోయడమే పని’ | This is dictatorship: Sooryavanshi childhood coach slams team management | Sakshi
Sakshi News home page

‘ఛాన్స్‌ ఇవ్వొద్దని భీష్మించుకున్నారు.. వాటర్‌ బాటిళ్లు మోయడమే పని’

Oct 14 2026 7:52 PM | Updated on Oct 14 2026 8:11 PM

This is dictatorship: Sooryavanshi childhood coach slams team management

టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్‌ సూర్యవంశీ చాన్నాళ్లుగా సొంతగడ్డపై బెంచ్‌కే పరిమితం అవుతున్నాడు. ఇంగ్లండ్‌ పర్యటన సందర్భంగా ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ పదిహేనేళ్ల పిల్లాడు.. ఆరంభంలో విఫలమైనా తిరిగి పుంజుకున్నాడు.

ముఖ్యంగా జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో వైభవ్‌ సూర్యవంశీ అదరగొట్టాడు. మూడు మ్యాచ్‌లలో కలిపి 151 పరుగులు చేసి.. భారత్‌ 3-0 తేడాతో జింబాబ్వేను క్లీన్‌స్వీప్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు సొంతం చేసుకున్నాడు.

వీవీఎస్‌ ఛాన్స్‌ ఇచ్చినా.. గంభీర్‌ నో!
అయితే, ఆ వెంటనే స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైనప్పటికీ.. వైభవ్‌ బెంచ్‌కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. సీనియర్‌ ఓపెనర్‌ సంజూ శాంసన్‌ రాకతో ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌కు తుదిజట్టులో చోటు కరువైంది. అయితే, ఆసియా క్రీడలు-2026 టోర్నీలో తాత్కాలిక హెడ్‌కోచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ వైభవ్‌ను ఆడించాడు.

కానీ.. తాజాగా వెస్టిండీస్‌తో సొంతగడ్డపై టీ20 సిరీస్‌లోనూ వరుస మ్యాచ్‌లలో వైభవ్‌ను మళ్లీ పక్కనపెట్టేశారు. తాజాగా హైదరాబాద్‌ వేదికగా విండీస్‌తో నాలుగో టీ20లోనూ వైభవ్‌కు మొండిచేయే ఎదురైంది. టీ20 ప్రపంచకప్‌-2026 హీరో సంజూకు వరుస అవకాశాలు ఇచ్చే క్రమంలో ఈ బిహారీ పిల్లాడు మరికొన్నాళ్లు వేచిచూడక తప్పదని హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ ఇప్పటికే స్పష్టం చేశాడు.

అవకాశం ఇవ్వొద్దని వాళ్లు భీష్మించుకున్నారు
ఈ పరిణామాల నేపథ్యంలో వైభవ్‌ సూర్యవంశీ చిన్ననాటి కోచ్‌ మనీశ్‌ ఓజా ఘాటుగా స్పందించాడు. ‘టైమ్స్‌ నౌ’తో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత టీమిండియా యాజమాన్యం.. ఆటగాళ్లను బెంచ్‌కే పరిమితం చేయడం ద్వారా జట్టును పటిష్టం చేయగలమని భావిస్తుందేమో!.. అందుకే వాళ్లు వైభవ్‌ను పక్కనపెడుతున్నారు.

ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. వారితో మాట్లాడితే మీకు అన్నీ అర్థమవుతాయి. తదుపరి తరం ఆటగాళ్లను తయారు చేయాలంటే వారికి ఆడే అవకాశాలు ఇవ్వాలని తెలిసి వస్తుంది. ఈ పిల్లాడికి అవకాశం ఇవ్వొద్దని వాళ్లు భీష్మించుకుని కూర్చున్నారు.

నీళ్ల బాటిళ్లు మోయడం వల్ల నో యూజ్‌
అతడిని విసిగెత్తిపోయేలా చేస్తున్నారు. జట్టుకు తాను ఉపయోగం లేదనే భావన కల్పిస్తున్నారు. అలాంటపుడు ఆ పిల్లాడు ఎంతలా వేదన చెంది ఉంటాడు. ఈ వయసులో వరుస మ్యాచ్‌లు ఆడితేనే అతడిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేగానీ బెంచ్‌ మీదే ఉంటూ.. నీళ్ల బాటిళ్లు మోయడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరదు.

ప్రస్తుతం ఉన్న మేనేజ్‌మెంట్‌ నియంతృత్వ ధోరణి అవలంభిస్తోంది. వాళ్ల మనసుకు ఏది తోస్తే అదే చేస్తున్నారు. అంతేతప్ప ఆటగాళ్లు, వారి భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. వైభవ్‌ ఓ తుఫాను లాంటివాడు. అతడిని ఎవరూ ఆపలేరు. నక్షత్రాలు, సూర్యుడి మాదిరి అతడు ప్రకాశించడాన్ని ఎవరూ ఆపలేరు. కాకపోతే అందుకు తగిన అవకాశాలు రావాలి. కచ్చితంగా ఆ సమయం వస్తుంది’’ అని మనీశ్‌ ఓజా పేర్కొన్నాడు.

చదవండి: పాకిస్తాన్‌ కెప్టెన్‌ ప్రపంచ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement