Photo Credit: Twitter
వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ ద్వారా టీమిండియాలో ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పవర్ ప్లే, స్లాగ్ ఓవర్లు పక్కకు పెడితే.. మిడిల్ ఓవర్లలో భారత్‌కు పరుగులు రావడం కష్టమైపోతుంది. ఒకప్పుడు జట్టులో ఆరో స్థానం వరకు స్పెషలిస్ట్ బ్యాటర్లు ఉండేవారు.
రాను రాను ఆ బాధ్యతలను ఆల్‌రౌండర్లతో పూడుస్తున్నారు. కానీ ఆల్రౌండర్లను పూర్తిగా నమ్మలేము. కచ్చితంగా ఒకరిద్దరు స్పెషలిస్ట్ బ్యాటర్లు ఉండి తీరాల్సిందే. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మను మినహాయిస్తే ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టులో నిఖార్సైన స్పెషలిస్ట్ బ్యాటర్ కరువయ్యాడని చెప్పొచ్చు.
మరి కోట్లు ఖర్చు పెట్టి ప్రతీఏటా ఘనంగా నిర్వహిస్తున్న ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వస్తున్న స్టార్ బ్యాటర్లంతా ఏమవుతున్నారు? ఐపీఎల్లో దంచికొట్టే రజత్ పటీదార్, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, ధ్రువ్ జురేల్, రింకూ సింగ్ వంటి అనుభం ఉన్న క్రికెటర్లను తరచూ ఎందుకు ఆడించడం లేదనేది ప్రశ్నగా మిగిలిపోయింది. బౌలింగ్‌లో చేస్తున్న మార్పులు బ్యాటింగ్‌లో ఎందుకు జరగడం లేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
రొటేషన్ పాలసీ గాలికి..
ఐపీఎల్ పుణ్యమా అని పుట్టగొడుగుల్లా బ్యాటర్లు పుట్టుకురావడంతో జాతీయ జట్టులో ఎవరికీ అవకాశం ఇవ్వాలనేది కాస్త తలనొప్పి వ్యవహారమే అయినప్పటికీ, రొటేషన్ పాలసీ ద్వారా బ్యాటర్లను తరచూ మార్చుకునేందుకు వీలుంటుంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు తరచూ రొటేషన్ పాలసీతోనే బ్యాటింగ్‌లో మార్పులు చేస్తూ వస్తున్నాయి. కానీ మన టీమిండియాకు వచ్చేసరికి మాత్రం ఒక సిరీస్‌కు జట్టును ఎంపిక చేస్తే అదే జట్టును వరుసగా ఆడిస్తూ వస్తున్నారు.
వన్డే, టెస్టు క్రికెట్‌తో పోలిస్తే టీ20 క్రికెట్ వేరు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి కొట్టుడే పరమావధిగా బ్యాటర్లు ఉంటారు. నిలకడైన జట్టు ఉండాలనేది మంచిదే అయినప్పటికీ, అన్ని సందర్భాల్లో ఇది వర్తించదు. ఉదాహరణకు విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఓపెనర్లు ఎంత బాగా ఆడినా, మిడిలార్డర్ బలోపేతం లేకపోతే పరుగులు తగ్గిపోతాయి.
బలహీనంగా మిడిలార్డర్..
విండీస్‌తో జరిగిన గత మూడు మ్యాచ్‌లలో మధ్య ఓవర్లలో భారత్ ఆట గణనీయంగా మందగించింది. పవర్‌ప్లేలో వేగంగా ప్రారంభించినప్పటికీ, ఫీల్డింగ్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత వారి బౌండరీల వేట సామర్థ్యం దెబ్బతింది. ఈ స్వల్ప తగ్గుదలనే వెస్టిండీస్ తమకు అనుకూలంగా మలుచుకొని ఫలితాలు రాబట్టింది. రెండు, నాలుగో వన్డేల్లో మన వైఫల్యానికి కారణం మిడిలార్డర్ బలంగా లేకపోవడమే అని బల్లగుద్ది చెప్పొచ్చు.
స్పెషలిస్ట్ బ్యాటర్ ఎక్కడ?
ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన చాలా మంది క్రికెటర్లు టీమిండియాలో ఆడాలని కలలు కంటుంటారు. అందరికీ కాకపోయినా, ఇప్పటికే తామేంటో నిరూపించుకున్న పటీదార్, పడిక్కల్, జురెల్, రుతురాజ్ వంటి స్పెషలిస్ట్ బ్యాటర్ల సేవలను ఉపయోగించుకుంటే బాగుంటుంది. వీళ్లందరికీ తలా ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల్లో అవకాశాలు ఇస్తూ పోతే కీలక ప్లేయర్ గాయపడ్డా మన రిజర్వ్ బెంచ్ బలంగా ఉందన్న నమ్మకం ఉంటుంది.
ఇదీ చదవండి:


