‘కొత్తవాళ్ల మోజులో పడి ఆ టీ20 స్పెషలిస్ట్‌ను మరిచారా?’ | Jaffer-Says-Missing-T20 Specialist-Rinku-Singh-Finisher-After-4th T20 Loss | Sakshi
Sakshi News home page

‘కొత్తవాళ్ల మోజులో పడి ఆ టీ20 స్పెషలిస్ట్‌ను మరిచారా?’

Oct 16 2026 8:30 AM | Updated on Oct 16 2026 8:56 AM

Jaffer-Says-Missing-T20 Specialist-Rinku-Singh-Finisher-After-4th T20 Loss

Photo Credit: Twitter

ఉప్పల్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 24 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. మిడిలార్డర్‌లో తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డిలు రాణించినప్పటికీ, జట్టును గెలిపించలేకపోయారు. గెలుపుకు 24 పరుగుల దూరంలో టీమిండియా నిలిచిపోయింది. సాధారణంగా ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే ఆటగాడిని ఫినిషర్‌గా పరిగణిస్తుంటారు. 

గత దశాబ్దంలో ఈ పాత్రను ధోని సమర్థంగా నిర్వర్తించాడు. చాలా మ్యాచ్‌ల్లో అతడు ఫినిషర్‌గా వచ్చి జట్టును గెలిపించాడు. కానీ ఇప్పుడు టీమిండియాకు ఫినిషర్ లోటు స్పష్టంగా తెలుస్తోంది. అనుభవం లేని ఆల్‌రౌండర్ నమన్ ధీర్ ఒత్తిడిని తట్టు‍కోలేక గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత నితీశ్‌రెడ్డి ఫినిషింగ్ టచ్ ఇచ్చినప్పటికీ, అది సరిపోలేదు.

ఈ నేపథ్యంలో టీమిండియాకు ఇప్పుడు రింకూ సింగ్ లాంటి ఫినిషర్ అవసరం ఉందని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. జాఫర్ మాట్లాడుతూ.. ''248 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జట్టులో సరైన ఫినిషర్ లేకపోవడం వల్లే భారత్ 24 పరుగుల  తేడాతో ఓటమి చవిచూసింది. కొత్త ఆటగాళ్ల మోజులో పడి గతంలో ఫినిషర్‌గా మంచి పేరు పొందిన రింకూ సింగ్ లాంటి విధ్వంసకర వీరుడిని జట్టు మేనేజ్‌మెంట్‌ పూర్తిగా మరిచిపోయినట్లుంది. 

నిజానికి రింకూ సింగ్‌కు ఫినిషర్‌గా మంచి రికార్డు ఉంది. టీమిండియా తరఫున రింకూ చాలా మ్యాచ్‌ల్లో ఐదు లేదా ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి 22 ఇన్నింగ్స్‌ల్లో 156కు పైగా స్ట్రైక్‌రేట్‌తో 518 పరుగులు సాధించాడు. బ్యాటర్ కోణం నుంచి చూస్తే రింకూ ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన రింకూ సింగ్ బౌలింగ్ చేయలేడన్న కారణంతో భారత జట్టుకు ఎంపిక చేయకపోవడం చాలా దురదృష్టకరం. 

రజత్ పటీదార్ కూడా లైన్‌లో ఉన్నప్పటికీ, రింకూ సింగ్ అతడి కంటే చాలా బెటర్ అని నా అభిప్రాయం. ఒత్తిడిలోనూ బాగా ఆడగలనని రింకూ సింగ్ ఇప్పటికే నిరూపించుకున్నాడు. లోయర్ ఆర్డర్‌లో అతడి లాంటి ఫినిషర్ ఇప్పుడు జట్టుకు చాలా అవసరం. ఇక స్పిన్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన నమన్‌ధీర్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. స్పిన్‌కు అనుకూలించే భారత పిచ్‌లపై కూడా అతడు సరైన బౌలింగ్ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. 

పవర్‌ప్లే తర్వాత బౌలింగ్‌లో వైవిధ్యం లేకపోతే ఆఫ్-స్పిన్నర్లకు బౌలింగ్ చేయడం కొంచెం కష్టం. రోస్టన్ చేజ్ అలా చేస్తాడు; అతడిని అభినందించాలి. ముఖ్యంగా భారత్‌లో ఉండే వైవిధ్యమైన పిచ్‌లపై నమన్ ధీర్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేస్తాడని ఆశించడం చాలా అత్యాశే అవుతుంది.

అతను టీ20 క్రికెట్ ఆడాలంటే బ్యాటింగ్‌లో అతని ప్రదర్శన చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను. దురదృష్టవశాత్తు, గత రెండు మ్యాచ్‌లలో అది జరగలేదు, కానీ వచ్చి 25-30 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడగల సామర్థ్యం అతనికి ఉంది.'' అని చెప్పుకొచ్చాడు.

ఈ ఏడాది జూలైలో జింబాబ్వే పర్యటన తర్వాత రింకూ సింగ్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించలేదు. ఈ ఏడాది టీ20ల్లో అతడు 13 మ్యాచ్‌లాడి 139.44 స్ట్రైక్‌రేట్‌తో 152 పరుగులు సాధించాడు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇరుజట్లు 2-2తో సమానంగా ఉన్నాయి. ఇరుజట్ల మధ్య ఆఖరి మ్యాచ్ రేపు బెంగళూరు వేదికగా జరగనుంది.

ఇదీ చదవండి: చేజింగ్ అంటేనే అత‌డి వెన్నులో వ‌ణుకు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement