చేజింగ్ అంటేనే అత‌డి వెన్నులో వ‌ణుకు! | Abhishek Sharma Never Crossed 30 Runs While Chasing 200-Plus-India-Team | Sakshi
Sakshi News home page

చేజింగ్ అంటేనే అత‌డి వెన్నులో వ‌ణుకు!

Oct 16 2026 7:24 AM | Updated on Oct 16 2026 7:44 AM

Abhishek Sharma Never Crossed 30 Runs While Chasing 200-Plus-India-Team

Photo Credit: BCCI Twitter

టీమిండియా రైజింగ్ స్టార్ అభిషేక్ శ‌ర్మ మొదటి బంతి నుంచే విధ్వంసం సృష్టించాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుంటాడు. బ‌రిలోకి దిగింది మొద‌లు బౌండ‌రీలు, సిక్స‌ర్ల వ‌ర్షంతో స్టేడియాన్ని హోరెత్తిచ‌డం అత‌డి నైజం. ముఖ్యంగా బ్యాటింగ్‌లో తొలి ప‌వ‌ర్ ప్లేలో(0-6 ఓవ‌ర్లు) అత‌డి ఆట‌తీరు న‌భూతో న‌భ‌విష్య‌త్తు అన్న త‌ర‌హాలో ఉంటుంది. ఇప్ప‌టికీ చాలాసార్లు ప‌వ‌ర్ ప్లేలో త‌న ఆట ఎలా  ఉంటుందో రుచి చూపించాడు.

నాణేనికి ఒకవైపు మాత్రమే..
కానీ ఇదంతా నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే.. రెండో వైపు క‌థ మొత్తం వేరేలా ఉంది. ప‌వ‌ర్ ప్లేలో  అభిషేక్‌కు స్ట్రైక్ రాక‌పోతే, మిగిలిన ఓవ‌ర్లు ఎలా ఆడ‌తాడ‌నేందుకు బుధ‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ ఒక ఉదాహ‌ర‌ణ‌. 248 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియాకు మ‌రో ఓపెన‌ర్ సంజూ సామ్స‌న్ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. 4.1 ఓవ‌ర్ల పాటు బ్యాటింగ్ చేసిన సామ్స‌న్ 23 బంతుల్లో 56 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. సంజూ ఔట‌య్యే స‌మ‌యానికి అభిషేక్ మూడు బంతుల్లో 2 ప‌రుగులతో ఆడుతున్నాడు.

కనిపించని మెరుపులు
ప‌వ‌ర్ ప్లే ముగిసిన త‌ర్వాత కూడా అభిషేక్ శ‌ర్మ క్రీజులో ఉన్న‌ప్ప‌టికీ బ్యాటింగ్ చేయ‌డంలో ఇబ్బంది ఎదుర్కొన్నాడు. బ్యాటింగ్‌లో పెద్ద‌గా మెరుపులు క‌నిపించని అభిషేక్ శ‌ర్మ చివ‌ర‌కు 24 బంతుల్లో 29 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో కేవ‌లం మూడు ఫోర్లు, ఒక సిక్స‌ర్ మాత్ర‌మే ఉన్నాయి. వాస్త‌వానికి ఉప్ప‌ల్ స్టేడియం అభిషేక్‌కు కొట్టిన పిండి. ఎందుకంటే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌ఫున లెక్క‌లేన‌న్ని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు.

చేజింగ్‌ అంటే భయమా?
కానీ ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన అంశం ఏంటంటే.. ఐపీఎల్ సంగతి ప‌క్క‌న‌బెడితే అంత‌ర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో  చేజింగ్ అన‌గానే అభిషేక్ శ‌ర్మ‌కు ఎక్క‌డ లేని వ‌ణుకు వ‌స్తున్న‌ట్లుగా అనిపిస్తుంది. చేజింగ్ స‌మ‌యంలో అత‌డి బ్యాటింగ్ శైలి ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తోంది. ముఖ్యంగా 200 ప్ల‌స్ స్కోర్లు ఛేదించాల్సిన స‌మ‌యంలో అభిషేక్ పూర్తిగా త‌డ‌బ‌డుతున్నాడు. చేజింగ్‌లో గ‌త‌ ఆరు ఇన్నింగ్స్‌ల్లో అభిషేక్ అత్య‌ధిక స్కోరు 29 మాత్ర‌మే. అదీ వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో వ‌చ్చింది.

ఛేద‌న‌లో గ‌త ఆరు ఇన్నింగ్స్‌ల్లో అభిషేక్ చేసిన స్కోర్లు
17 (8) వ‌ర్సెస్ సౌతాఫ్రికా
0 (1) వ‌ర్సెస్ న్యూజిలాండ్‌
0 (1) వ‌ర్సెస్ న్యూజిలాండ్‌
10 (7) వ‌ర్సెస్ ఇంగ్లండ్‌
3 (5) వ‌ర్సెస్ ఇంగ్లండ్‌
29 (24) వ‌ర్సెస్ వెస్టిండీస్‌

గ‌త ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఛేద‌న స‌మ‌యంలో అభిషేక్ సాధించిన ప‌రుగులివి. ఇందులో రెండు గోల్డెన్ డ‌క్‌లు ఉండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా ఛేదన సమయంలో గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో 46 బంతులెదుర్కొని 59 పరుగులు మాత్రమే సాధించాడు. మొద‌ట బ్యాటింగ్ చేస్తే దంచికొట్ట‌డం.. రెండో బ్యాటింగ్‌కు వ‌స్తే విఫ‌ల‌మ‌వ్వ‌డం అభిషేక్ స్టైల్‌గా మారిపోయిన‌ట్లుంది. కానీ ఒక బ్యాట‌ర్‌గా తొలి ఇన్నింగ్స్‌లోనే కాదు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఒత్తిడిని తట్టుకొని ఆడితేనే ఆట‌కు పూర్తి న్యాయం చేసిన వాడ‌వుతాడు. 

అందుకే ఉప్ప‌ల్‌లో జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో అభిషేక్ ఔట‌వ్వ‌గానే సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ‘‘అభిషేక్ ఒక ప‌వ‌ర్ ప్లే బ్యాట‌ర్ మాత్ర‌మే.. స్లాగ్ ఓవ‌ర్ల‌లో బ్యాటింగ్ చేసే స‌త్తా అత‌డికి లేదు అని, ఛేద‌న అన‌గానే అభిషేక్ వెన్నులో వ‌ణుకు పుడుతుందేమో’’ అని కామెంట్లు పెట్టారు.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement