source: X
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ టెస్టు క్రికెట్‌లో మరిన్ని అరుదైన ఘనతలు సాధించాడు. మెక్‌కే వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో కేవలం 12 పరుగులకే 6 వికెట్లు పడగొట్టిన అతడు.. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో దక్షిణాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్‌ను అధిగమించాడు. అలాగే మరిన్ని రికార్డులు నెలకొల్పాడు.
స్టార్క్ సరికొత్త చరిత్ర
తాజా 6 వికెట్ల ప్రదర్శనతో స్టార్క్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు (56 మ్యాచ్‌ల్లో 230 వికెట్లు) తీసిన బౌలర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో తన సహచరులు కమిన్స్ (225), నాథన్ లియోన్ (225)ను అధిగమించాడు. ఈ జాబితాలో భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ (195), జస్ప్రీత్ బుమ్రా (185) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
డేల్ స్టెయిన్‌ను దాటిన స్టార్క్
ఈ ప్రదర్శనతో స్టార్క్ టెస్టుల్లో తన వికెట్ల సంఖ్యను 441కి పెంచుకున్నాడు. దీంతో 439 వికెట్లతో ఉన్న దక్షిణాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్‌ను అధిగమించి టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 10వ స్థానానికి చేరుకున్నాడు.
వసీమ్ అక్రమ్ తర్వాతి స్థానం
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఎడమచేతి వాటం పేసర్ల జాబితాలోనూ స్టార్క్ మరో మెట్టు ఎక్కాడు. తాజా ప్రదర్శనతో స్టార్క్ అంతర్జాతీయ క్రికెట్‌లో 767 వికెట్లకు చేరుకుని శ్రీలంక మాజీ పేసర్ చామిందా వాస్ (761)ను అధిగమించాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ దిగ్గజం వసీమ్ అక్రమ్ అగ్రస్థానంలో ఉన్నాడు.
22 బంతుల్లోనే 5 వికెట్లు
బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లు పూర్తి చేయడానికి స్టార్క్‌కు కేవలం 22 బంతులు మాత్రమే అవసరమయ్యాయి. దీంతో ఆస్ట్రేలియా తరఫున అత్యంత వేగంగా టెస్టు ఫైఫర్ (5 వికెట్ల ఘనత) సాధించిన బౌలర్ల జాబితాలో మరోసారి చోటు సంపాదించాడు. ఈ జాబితాలో స్టార్క్‌దే అగ్రస్థానం. వెస్టిండీస్‌పై గతంలో కేవలం 15 బంతుల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు.
అత్యుత్తమ గణాంకాలు
స్టార్క్ 6/12 ప్రదర్శన బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ సాధించిన అత్యుత్తమ టెస్టు బౌలింగ్ గణాంకాలుగా నిలిచాయి. ఇంతకుముందు ఈ రికార్డు జోష్ హేజిల్‌వుడ్ పేరిట ఉండేది. అతడు 6/89తో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
అత్యుత్తమ ప్రదర్శన
స్వదేశంలో బంగ్లాదేశ్‌పై ఎడమచేతి వాటం పేసర్ సాధించిన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కూడా ఇప్పుడు స్టార్క్ పేరిటే ఉన్నాయి. వెస్టిండీస్ మాజీ పేసర్ పెడ్రో కాలిన్స్ రికార్డును అతడు అధిగమించాడు. కాలిన్స్ 6/53తో 22 ఏళ్లుగా ఈ రికార్డును తన పేరిట ఉంచుకున్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. స్టార్క్ ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 64 పరుగులకే కుప్పకూలింది. కమిన్స్ 3, హాజిల్‌వుడ్ ఓ వికెట్‌తో స్టార్క్‌కు సహకరించారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో నలుగురు డకౌట్లు కాగా.. మెహిది హసన్ (11), హసన్ మహమూద్ (10), తైజుల్ ఇస్లాం (11 నాటౌట్), షొరీఫుల్ ఇస్లాం (14) మాత్రమే రెండెంకెల స్కోర్లు చేశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ కూడా కష్టాల్లో పడింది. తొలి రోజు మూడో సెషన్ సమయానికి ఆ జట్టు 148 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. షొరీఫుల్ ఇస్లాం (5-31) ఆసీస్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. గ్రీన్ (45 నాటౌట్) ఆసీస్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించేందుకు కష్టపడుతున్నాడు. అతడికి జతగా స్టార్క్ (1) క్రీజ్‌లో ఉన్నాడు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో పర్యాటక బంగ్లాదేశ్ తొలి టెస్ట్‌లో సంచలన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.


