source: X
దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ జొలాని టెటే (Zolani Tete) దారుణ హత్యకు గురయ్యారు. 38 ఏళ్ల టెటేను ఈస్టర్న్ కేప్‌లోని మ్డాంట్సేన్‌లో ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు.
దక్షిణాఫ్రికా క్రీడలు, కళలు, సాంస్కృతిక శాఖ మంత్రి గేటన్ మెకెంజీ వెల్లడించిన వివరాల ప్రకారం.. టెటే తన కారులో ఇంటికి చేరుకుని గేటు తెరుచుకునే వరకు వేచి ఉండగా ఇద్దరు సాయుధ దుండగులు తుపాకీలతో కాల్పులు జరిపి పరారయ్యారు.
ఈ కాల్పుల్లో అదే కారులో ఉన్న 27 ఏళ్ల ఓ మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వేగవంతమైన నాకౌట్‌తో ప్రపంచ రికార్డు
ఎడమచేతి వాటం బాక్సర్ అయిన టెటే కెరీర్‌లో ఎన్నో కీలక విజయాలు సాధించారు. 2007-08లో WBF ఫ్లైవెయిట్ ప్రపంచ టైటిల్, 2017, 2019లో WBO బాంటమ్‌వెయిట్ ప్రపంచ టైటిల్ గెలుచుకున్నారు.
2014లో జపాన్‌లో టెయిరు కినోషితాను పాయింట్లపై ఓడించి IBF జూనియర్ బాంటమ్‌వెయిట్ ప్రపంచ టైటిల్‌ను కైవసం చేసుకోవడం ఆయన కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది.
2017లో సిబోనిసో గోన్యాపై ప్రపంచ టైటిల్ పోరులో టెటే కేవలం 11 సెకన్లలోనే నాకౌట్ సాధించారు. తొలి పంచ్‌తోనే ప్రత్యర్థిని పడగొట్టిన ఈ విజయం ప్రపంచ టైటిల్ పోరులో అత్యంత వేగవంతమైన నాకౌట్‌లలో ఒకటిగా నిలిచింది. టెటే ప్రొఫెషనల్ కెరీర్‌లో 29 విజయాలు, 22 నాకౌట్లు, 4 ఓటములు, ఒక నో-కాంటెస్ట్ నమోదు చేశారు.
2022 జూలైలో లండన్‌లోని వెంబ్లీ అరేనాలో జాసన్ కన్నింగ్‌హామ్‌పై సాధించిన విజయం ఆయన చివరి బౌట్‌గా నిలిచింది. అయితే అనంతరం నిర్వహించిన పరీక్షలో స్టానోజోలోల్ అనే నిషేధిత పదార్థం పాజిటివ్‌గా రావడంతో ఆ ఫలితాన్ని రద్దు చేసి, టెటేపై నాలుగేళ్ల నిషేధం విధించారు.
తాను ఉద్దేశపూర్వకంగా నిషేధిత పదార్థాన్ని తీసుకోలేదని టెటే ఎప్పటికీ ఖండించారు. ఈ ఏడాది జూలైలో నిషేధం ముగియడంతో తిరిగి బాక్సింగ్‌లోకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఇంతలోనే ఆయన హత్యకు గురికావడం దక్షిణాఫ్రికా క్రీడా ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టింది.
చదవండి: వైభవ్‌కు టెస్టుల్లోనూ అవకాశం ఇవ్వాలి..!


