పృథ్వీ షా (PC: X)
సర్వీసెస్‌తో రంజీ మ్యాచ్‌లో మహారాష్ట్ర కెప్టెన్ పృథ్వీ షా మెరుపు అర్ధ శతకం సాధించాడు. నలభై తొమ్మిది బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. కాగా రంజీ ట్రోఫీ ఎలైట్ 2026-27 సీజన్‌లో భాగంగా మహారాష్ట్ర తమ తొలి మ్యాచ్‌లో సర్వీసెస్ జట్టుతో తలపడుతోంది.
రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ భారత్-‘ఎ’ వన్డే జట్టు సారథిగా విధుల్లో ఉండగా.. మహారాష్ట్ర తాత్కాలిక కెప్టెన్‌గా పృథ్వీ షా బాధ్యతలు చేపట్టాడు. ఇక ఢిల్లీలోని పాలెం ‘ఎ’ స్టేడియంలో మహారాష్ట్ర- సర్వీసెస్ జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ మొదలైంది.
ఆదిలోనే ఎదురుదెబ్బలు
టాస్ గెలిచిన మహారాష్ట్ర తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ సచిన్ దాస్ (34 బంతుల్లో 14)ను ఏపీ శర్మ వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా.. వన్‌డౌన్‌లో వచ్చిన దిగ్విజయ్ పాటిల్ (13 బంతుల్లో 5)ను రాజ్ బహదూర్ బౌల్డ్ చేశాడు. వీరిద్దరు విఫలమైనప్పటికీ మరో ఓపెనర్, కెప్టెన్ పృథ్వీ షా నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.
49 బంతుల్లోనే అర్ధ శతకం
కేవలం 49 బంతుల్లోనే అర్ధ శతకం సాధించిన పృథ్వీ షా.. మొత్తంగా 73 బంతులు ఎదుర్కొని 70 పరుగులు చేసి ఏపీ శర్మ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. పృథ్వీ షా నిలకడైన ప్రదర్శన కారణంగా మహారాష్ట్ర 30 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి వంద పరుగుల స్కోరు దాటగలిగింది.
చేదు అనుభవం తర్వాత
కాగా ఇటీవలే పృథ్వీ షాకు వ్యక్తిగత జీవితంలో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. మోడల్, నటి ఆకృతి అగర్వాల్ పృథ్వీ షాతో తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే, అతడు మాత్రం ఇంత వరకు ఈ విషయంపై నేరుగా స్పందించలేదు. ఆట మీద పూర్తి శ్రద్ధ పెట్టిన పృథ్వీ.. తాజా రంజీ ఎడిషన్‌లో శుభారంభం అందుకున్నాడు.


