
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో భారత తదుపరి టెస్టు కెప్టెన్ ఎవరన్న చర్చ మొదలైంది. టెస్టు కెప్టెన్సీ రేసులో యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ముందుంజలో ఉన్నాడు. కెప్టెన్‌గా గిల్ ఎంపిక దాదాపు ఖాయమైందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టీమిండియా తదుపరి కెప్టెన్ గిల్ అన్న ఊహాగానాలపై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కొంతమంది మాజీలు సంతృప్తి వ్యక్తం చేస్తూంటే.. మరి కొంత మంది సీనియర్ ఆటగాడిని కెప్టెన్‌గా చేయాలని బీసీసీఐని సూచిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను భారత కెప్టెన్‌గా ఎంపిక చేయాలని అశ్విన్ సూచించాడు..
"ప్రస్తుత భారత జట్టులో రవీంద్ర జడేజా అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు. అతడిని కూడా కెప్టెన్సీ ఎంపికగా పరిగణించాలి. మీరు కొత్త ఆటగాడికి శిక్షణ ఇచ్చి తర్వాత కెప్టెన్‌గా చేయాలని భావిస్తుంటే.. సారథిగా మీకు జడేజా బెస్ట్ ఛాయిస్. జడేజా రెండేళ్ల పాటు జట్టుకు నాయకత్వం వహించవచ్చు.
జడ్డూకు డిప్యూటీగా మీరు ఎవరినైతే కెప్టెన్‌గా చేయాలనకుంటున్నారో వారిని నియమించండి. అప్పుడు అతడు మరింత రాటుదేలుతాడు. భారత జట్టుకు కెప్టెన్ కావడం ప్రతి ఆటగాడి కల. జడేజాకు అవకాశమిస్తే అతడు కచ్చితంగా స్వీకరిస్తాడని" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
అదేవిధంగా శుబ్‌మన్ గిల్‌పై కూడా అశూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుందని నేను ఆశిస్తున్నాను. గిల్ అక్కడ జట్టును గెలిపిస్తే.. కెప్టెన్‌గా పరిపక్వత సాధించినట్లు అవుతోంది. అయితే టెస్టుల్లో కెప్టెన్సీ అంత సలువు కాదు. ఒక కెప్టెన్‌గా ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో కూడా ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని అశ్విన్ అన్నాడు.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. విధ్వంసకర ఓపెనర్ రీ ఎంట్రీ