‘ఫిఫా’ ప్రపంచకప్‌లో ఆడిన తొలి భారత సంతతి ఆటగాడిగా రికార్డు
న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పంజాబీ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్‌లో ఆడిన తొలి భారత సంతతి ఆటగాడిగా సర్‌ప్రీత్ సింగ్ నిలిచాడు. న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 27 ఏళ్ల సర్‌ప్రీత్ ఇరాన్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. గతంలోనూ పలువురు భారత మూలాలున్న ప్లేయర్లు ‘ఫిఫా’ వరల్డ్‌కప్‌లో పాల్గొన్నప్పటికీ... సర్‌ప్రీత్ లాగా మ్యాచ్ ఆరంభానికి ముందే ప్రకటించిన ‘స్టార్టింగ్ ప్లెయింగ్ ఎలెవన్’లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయారు. సోమవారం అర్ధరాత్రి దాటాక ఇరాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్‌ప్రీత్ న్యూజిలాండ్ తరఫున ఆకట్టుకున్నాడు.
పంజాబీ దంపతులకు ఆక్లాండ్‌లో జన్మించిన సర్‌ప్రీత్‌కు ఇదే తొలి ‘ఫిఫా’ ప్రపంచకప్ మ్యాచ్. మ్యాచ్ ఆరంభం నుంచి మైదానంలో పరుగులు తీసిన అతడు... 90వ నిమిషం వరకు కొనసాగడం విశేషం. 10వ నంబర్ జెర్సీతో ఆడిన సర్‌ప్రీత్... మ్యాచ్ మొత్తంలో మూడు షాట్‌లు ఆడాడు. అందులో 61వ నిమిషంలో కొట్టిన బంతిని ఇరాన్ గోల్‌కీపర్ అడ్డుకున్నాడు. 2018లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సర్‌ప్రీత్... భారత్‌లో భారత ప్రత్యర్థిగానూ మ్యాచ్‌లు ఆడాడు. అదే ఏడాది ముంబై వేదికగా జరిగిన ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో అతడు కివీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అప్పుడు సునీల్ ఛెత్రీకి ప్రత్యర్థిగా మ్యాచ్ ఆడాడు.
ఆ టోర్నమెంట్‌లో కెన్యాపై ఒక గోల్ చేసిన సర్‌ప్రీత్... భారత్‌తో మ్యాచ్‌లో రెండు గోల్స్‌లో కీలకపాత్ర పోషించాడు. న్యూజిలాండ్ ఈ నెల 21న తమ తదుపరి మ్యాచ్‌లో ఈజిప్‌్టతో తలపడనుంది... సర్‌ప్రీత్ జోరు చూస్తుంటే ఆ మ్యాచ్‌లోనూ అతడు ‘ఫుల్ టైమ్’ ఆడటం ఖాయమే. ఇక ఇదే ప్రపంచకప్‌లో ఆ్రస్టేలియా తరఫున భారత మూలాలున్న నిషాన్ వేలుపిళ్లై టర్కీతో మ్యాచ్‌లో ఆడాడు. అతడి తల్లి ఆంగ్లో ఇండియన్ కాగా... తండ్రి తమిళ మూలాలు ఉన్న శ్రీలంక వాసి. అంతకుముందు 2006 ‘ఫిఫా’ ప్రపంచకప్‌లో భారత సంతతికి చెందిన వికాస్ దొరసు... ఫ్రాన్స్ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడాడు.
అయితే ఈ రెండు మ్యాచ్‌ల్లో కలిసి వికాస్ కొన్ని నిమిషాలు మాత్రమే మైదానంలో కనిపించాడు. తొలి మ్యాచ్‌లో 84వ నిమిషంలో మైదానంలో అడుగుపెట్టిన వికాస్... రెండో దాంట్లో 88వ నిమిషం తర్వాత గ్రౌండ్‌లోకి వచ్చాడు. వికాస్ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం వాసులు. ప్రస్తుత ప్రపంచకప్‌లో మరో ఇద్దరు భారత సంతతి ఆటగాళ్లు కూడా ఉన్నారు. డీఆర్ కాంగో జట్టులో సామ్యూల్ ముత్తుసామి, ఖతార్‌లో తహసిన్ మహమ్మద్ జంషెద్ ఉన్నారు.


