
బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య ఆఖరి పోరు
నేడు ఐపీఎల్–18 సీజన్ ఫైనల్
గెలిచిన టీమ్‌కు తొలి టైటిల్
ఐపీఎల్ 2008లో మొదలైంది... తొలి సీజన్... రెండు.... మూడు... నాలుగు... ఇలా చూస్తూ చూస్తూ 17 సీజన్లు గడిచిపోయాయి. కానీ ఒక్కసారైనా విజేతగా నిలవాలనే ఆ రెండు జట్ల కోరిక మాత్రం నెరవేరలేదు. ఇన్నేళ్లలో ఎంతో మంది ఆటగాళ్లు మారారు... కోచ్‌లు కొత్తగా వచ్చారు, వ్యూహాలూ మారాయి... వైఫల్యాలతో నిష్క్రమించిన ప్రతీసారి వచ్చే ఏడు మనదే అవుతుందనే ఆశతో మళ్లీ సున్నా నుంచి మొదలు పెట్టడం, ఆపై కీలక దశలో కుప్పకూలడం సాధారణంగా మారిపోయాయి తప్ప ఐపీఎల్ టైటిల్ ద్రాక్ష అందనే లేదు... ఒక టీమ్ ఈ ప్రయత్నంలో మూడుసార్లు తుది పోరుకు చేరి నిరాశతో వెనుదిరగ్గా... మరో జట్టు ఒకే ఒక్కసారి ఆఖరి మెట్టుకు చేరి చతికిలపడింది... ఇప్పుడు ఆ రెండు టీమ్‌లలో ఒకరికి ఉపశమనం దక్కే సమయం వచ్చింది.
ఐపీఎల్ 18వ సీజన్‌లో కొత్త జట్టు చాంపియన్‌గా నిలవడం ఖరారైన నేపథ్యంలో తొలిసారి ఈ టైటిల్‌ను ఎవరు అందుకుంటారనేది ఆసక్తికరం. మొదటి ట్రోఫీ వేటలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లు నేడు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో సర్వశక్తులూ ఒడ్డనున్నాయి.
రాత్రి 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
అహ్మదాబాద్: ఐపీఎల్–18 సీజన్‌లో 73 హోరాహోరీ మ్యాచ్‌ల తర్వాత ఈ ఏడాది విజేతను తేల్చే అసలు సమరానికి అంతా సిద్ధమైంది. నరేంద్ర మోదీ
స్టేడియంలో నేడు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. లీగ్ దశలో ప్రదర్శనను చూస్తే ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపించాయి. రన్‌రేట్ కారణంగా పంజాబ్ మొదటి స్థానంలో, బెంగళూరు రెండో స్థానంలో నిలిచినా... రెండు టీమ్‌లూ సమంగా తొమ్మిదేసి విజయాలు సాధించి 19 పాయింట్లతో నిలిచాయి.
‘ప్లే ఆఫ్స్’కు ముందు ప్రత్యర్థులుగా తలపడిన మ్యాచ్‌లలో ఇరు జట్లు ఒక్కో విజయాన్ని అందుకోగా... క్వాలిఫయర్–1లో పంజాబ్‌ను చిత్తు చేసి బెంగళూరు పైచేయి సాధించింది. ఈ నేపథ్యంలో ఆఖరి పోరులో గెలిచి పంజాబ్ లెక్క సరి చేస్తుందా లేదా ఆర్‌సీబీ ఆధిత్యం కొనసాగుతుందా చూడాలి. మొత్తంగా ఎవరు గెలిచినా తొలి ట్రోఫీతో సంబరాలు అంబరాన్ని తాకడం ఖాయం.
సమష్టి ప్రదర్శనతో...
ఐపీఎల్‌లో ఆర్‌సీబీ 2016లో ఆఖరిసారిగా ఫైనల్ చేరింది. ఆ మ్యాచ్‌లో ఓటమి తర్వాత ఆడిన ఎనిమిది సీజన్లలో జట్టు ప్రదర్శన అంతంత మాత్రమే. ముఖ్యంగా ఎవరో ఒక ఆటగాడి ప్రదర్శనపైనే ఆధారపడటం, అతను విఫలమైతే జట్టు కుప్పకూలడం తరచుగా సాగాయి. కానీ ఈ సీజన్ పూర్తి భిన్నంగా కనిపించింది. జట్టు పది మ్యాచ్‌లు గెలిస్తే తొమ్మిది మంది వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’లుగా నిలిచారు. ఒకరు విఫలమైతే మరొకరు ఆదుకోవడంతో కీలక సమయాల్లో కూడా జట్టు పట్టు వీడలేదు. ఇప్పుడు అదే శైలి, పోరాటతత్వం బెంగళూరును ఫైనల్‌కు చేర్చాయి. ఎప్పటిలాగే స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి 600కు పైగా పరుగులు, 8 అర్ధసెంచరీలతో జట్టుకు చుక్కానిలా నిలిచాడు. అతని ఓపెనింగ్‌లో సరైన జోడీగా ఫిల్ సాల్ట్ 387 పరుగులతో శుభారంభాలు అందించాడు.
మిగతా బ్యాటర్లలో షెఫర్డ్, జితేశ్, కృనాల్ పాండ్యా కూడా ప్రభావవంతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. కెపె్టన్ పాటీదార్ గత ప్రదర్శనలతో పోలిస్తే ఈసారి అంత అద్భుతంగా ఆడకపోయినా... కెపె్టన్‌గా తొలి సీజన్‌లో జట్టును ఫైనల్ చేర్చిన ఘనత అతనికి దక్కింది. మైదానంలో కోహ్లి అనుభవం, సూచనలు అండగా ఉన్న పాటీదార్ నాయకత్వంలో టీమ్ టైటిల్ గెలిస్తే ఆర్‌సీబీ అభిమానుల కోరిన నెరవేర్చిన ప్రత్యేక వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతాడు.
బౌలింగ్‌లో కూడా టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. జట్టు బౌలింగ్ సత్తా తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్‌పైనే కనిపించింది. ముఖ్యంగా హాజల్‌వుడ్ ఆ్రస్టేలియా నుంచి తిరిగి రావడం ఒక్కసారిగా జట్టు బలాన్ని పెంచింది. 21 వికెట్లతో అతను టీమ్ విజయాల్లో కీలకపాత్ర పోషించగా... భువనేశ్వర్, యశ్ దయాళ్ సహకరించారు. లెగ్ స్పిన్నర్ సుయాశ్ శర్మ కూడా పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టిపడేయగలడు.
ఆ నలుగురితో కలిసి...
తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌ను మినహాయిస్తే సీజన్ ఆసాంతం పంజాబ్ ప్రదర్శన అద్భుతంగా సాగింది. ముఖ్యంగా రెండో క్వాలిఫయర్‌లో ముంబైని చిత్తు చేసిన తీరు ఆ జట్టు సామర్థ్యాన్ని చూపించింది. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ తన అసాధారణ బ్యాటింగ్‌తో 600కు పైగా పరుగులు చేయడంతో పాటు సమర్థ నాయకత్వంతో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇద్దరు విదేశీ బ్యాటర్లు ఇన్‌గ్లిస్, స్టొయినిస్‌లకు కీలక సమయాల్లో ఒత్తిడిని దాటి చెలరేగిపోగల నైపుణ్యం ఉంది. అయితే పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర మరో నలుగురు బ్యాటర్లు పోషిస్తున్నారు.
వీరంతా జాతీయ జట్టుకు ఆడని ‘అన్‌క్యాప్డ్’ ఆటగాళ్లే కావడం విశేషం. ఓపెనర్లు ప్రియాన్ష్ఆర్య, ప్రభ్‌సిమ్రన్‌తో పాటు నేహల్ వధేరా, శశాంక్ సింగ్ ఈ మ్యాచ్‌లో రాణిస్తే కింగ్స్‌కు తిరుగుండదు. పంజాబ్ బౌలింగ్‌లో కాస్త తడబాటు కనిపిస్తోంది. అర్ష్‌దీప్ ఆశించిన స్థాయిలో సరైన ఆరంభాలు ఇవ్వడం లేదు. జేమీసన్ మెరుగ్గా ఉన్నా, మూడో పేసర్ అజ్మతుల్లా బౌలింగ్ కూడా సాధారణంగానే ఉంది. చహల్ స్పిన్ మరోసారి కీలకం కానుంది. ఫైనల్ ఒత్తిడిని అధిగమిస్తే పంజాబ్‌కు గెలుపు కష్టం కాబోదు.
తుది జట్ల వివరాలు (అంచనా)
బెంగళూరు: రజత్ పాటీదార్ (కెపె్టన్), కోహ్లి, సాల్ట్, మయాంక్ అగర్వాల్, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, షెఫర్డ్, భువనేశ్వర్, కృనాల్ పాండ్యా, యశ్ దయాళ్, హాజల్‌వుడ్.
పంజాబ్: శ్రేయస్ అయ్యర్ (కెపె్టన్), ప్రియాన్ష్ఆర్య, ప్రభ్‌సిమ్రన్, ఇన్‌గ్లిస్, నేహల్ వధేరా, స్టొయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా, చహల్, జేమీసన్, అర్ష్‌దీప్ సింగ్.
పిచ్, వాతావరణం
సీజన్ ఆరంభం నుంచి భారీ స్కోర్లు నమోదయ్యాయి. రెండో క్వాలిఫయర్ తర హాలోనే టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపవచ్చు. వర్ష సూచన ప్రస్తుతానికి లేదు కానీ వాన వస్తే అదనపు సమయంతో పాటు బుధవారం ‘రిజర్వ్ డే’ కూడా ఉంది.