
యు ముంబాపై 18 పాయింట్ల తేడాతో ఘన విజయం
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో పుణేరి పల్టన్ ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసుకొని పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. గత రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన పుణేరి పల్టన్ గురువారం జరిగిన పోరులో యు ముంబాపై ఏకపక్ష విజయం సాధించింది. సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన పుణేరి పల్టన్ 40–22 పాయింట్ల తేడాతో యు ముంబాను చిత్తుచేసింది. పుణేరి పల్టన్ జట్టు తరఫున స్టువర్ట్ సింగ్ 8 పాయింట్లు, గుర్‌దీప్ 5 పాయింట్లు సాధించగా... అభినేష్, గౌరవ్ ఖత్రి చెరో 4 పాయింట్లు సాధించారు.
యు ముంబా జట్టు తరఫున అమీర్ మొహమ్మద్ 6 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో యు ముంబా జట్టు 12 రెయిడ్ పాయింట్లు సాధించగా... ఫుణేరి పల్టన్ జట్టు 14 రెయిడ్ పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అయితే ట్యాక్లింగ్‌లో యు ముంబా 6 పాయింట్లకు పరిమితం కాగా... పల్టన్ 20 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. తాజా సీజన్‌లో 8 మ్యాచ్‌లాడిన పుణేరి పల్టన్ 6 విజయాలు, 2 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్’ ప్లేస్‌కు చేరింది.
మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 45–41తో బెంగాల్ వారియర్స్‌పై గెలుపొందింది. జైపూర్ రైడర్లు నితిన్ 13, అలీ 12 పాయింట్లతో విజృంభించగా... వారియర్స్ తరఫున దేవాంక్ 16, మన్‌ప్రీత్ 10 పాయింట్లు సాధించారు. దేవాంక్‌కు ఇది వరుసగా ఏడో ‘సూపర్–10’ కావడం విశేషం. ఈ లీగ్ చరిత్రలో అత్యంత వేగంగా (38 మ్యాచ్‌ల్లో) 400 రెయిడ్ పాయింట్లు సాధించిన ప్లేయర్‌గా దేవాంక్ నిలిచాడు. నేడు పుణేరి పల్టన్‌తో హరియాణా స్టీలర్స్, తమిళ్ తలైవాస్‌తో తెలుగు టైటాన్స్ ఆడతాయి.