పంత్‌పై ప్రేమ.. శాంసన్‌పై చిన్న చూపు.. రుజువులివే..!

Proofs For BCCI Encouraging Rishabh Pant Over Sanju Samson - Sakshi

టీమిండియాకు కొందరు ఆటగాళ్ల ఎంపికలో పక్షపాత ధోరణి అనేది బీసీసీఐలో అనాదిగా వస్తున్న బహిరంగ సంప్రదాయం. భారత క్రికెట్‌ తొలినాళ్లలో ఇది అడపాదడపా కనిపించినప్పటికీ.. ఇటీవలి కాలంలో ఈ సంప్రదాయం పట్ట పగ్గాల్లేకుండా పోతుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ రిషబ్‌ పంత్‌, సంజూ శాంసన్‌ల వ్యవహారం. వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్లైన ఈ ఇద్దరు క్రికెటర్లు ప్రతిభావంతులే అయినప్పటికీ, బీసీసీఐ.. శాంసన్‌తో పోలిస్తే పంత్‌ను ఎక్కువగా ప్రోత్సహించి అవకాశాలిస్తుంది.

బీసీసీఐకి, సెలెక్లర్లకు పంత్‌పై ప్రేమ, శాంసన్‌పై చిన్నచూపుకు వర్ణించలేని, నిషేధిత కారణాలు చాలానే ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఇటీవల శాంసన్‌కు మద్దతు బాగానే పెరుగుతున్నప్పటికీ.. భారత క్రికెట్‌ బోర్డు పెద్దలు ఇవేవీ పట్టనట్లు పంత్‌ వరుసగా విఫలమవుతున్నా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా న్యూజిలాండ్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో ఇషాన్‌ కిషన్‌, పంత్‌లకు వరుస అవకాశాలిచ్చిన టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఫామ్‌లో ఉన్న శాంసన్‌ను బెంచ్‌కే పరిమితం చేసింది.

ఓ పక్క పంత్‌ వికెట్‌కీపర్‌గా, బ్యాటర్‌గా విఫలమవ్వడం వల్ల టీమిండియాకు జరగాల్సిన నష్టాలు జరుగుతున్నప్పటికీ.. యాజమాన్యం ఉదాసీనంగా వ్యవహరిస్తూనే ఉంది. శాం‍సన్‌ విషయంలో చిన్న చూపు చూడటం మేనేజ్‌మెంట్‌కు పరిపాటిగా మారింది. ప్రశ్నించే వారు లేరని పంత్‌ను ప్రతి విషయంలోనూ వెనకేసుకొస్తూనే ఉంది. పంత్‌కు ఇచ్చినన్ని అవకాశాలు భారత క్రికెట్‌ చరిత్రలో ఏ ఇతర ఆటగాడికి ఇవ్వలేదని సోషల్‌మీడియా కోడై కూస్తున్నా బీసీసీఐ ఈ విషయాన్ని పెడచెవిన పెడుతూ తన పని తాను చేసుకుంటూ పోతుంది.

ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో పంత్‌ అనవసరపు షాట్‌ ఆడి వికెట్‌ పారేసుకోవడంతో పట్టలేని ఆగ్రహానికి గురైన క్రికెట్‌ అభిమానులు పంత్‌ను, అతన్ని వెనకేసుకొస్తున్న బీసీసీఐని, సెలెక్షన్‌ కమిటీని ఏకీ పారేస్తున్నారు. పంత్‌ వైఫల్యాలు టీమిండియాపై ప్రభావం చూపుతున్నా బీసీసీఐ ఎందుకు పట్టించుకోవట్లేదని నిలదీస్తున్నారు. పంత్‌పై ఎనలేని ప్రేమ, శాంసన్‌పై బీసీసీఐ చిన్నచూపు చూస్తుందనడానికి ఇంతకంటే సాక్షాలు ఏమి కావాలంటూ ఇద్దరి గణాంకాలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ ట్రోలింగ్‌కు దిగుతున్నారు.

శాంసన్‌ 2015లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేస్తే, ఇప్పటివరకు ఆడింది కేవలం 16 మ్యాచ్‌లే అయితే.. 2017లో పొట్టి క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పంత్‌ ఏకంగా 65 టీ20లు ఆడాడంటూ సెలెక్టర్ల ధోరణిని ఎండగడుతున్నారు. శాంసన్‌కు ఒక్క టీ20ల్లోనే కాదు.. వన్డేల్లో, టెస్ట్‌ల్లో కూడా అన్యాయం జరిగిందని అతని అభిమానులు వాపోతున్నారు. 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆటగాడికి ఇప్పటివరకు కేవలం 10 వన్డేల్లో మాత్రమే అవకాశం​ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. టెస్ట్‌ల్లో అయితే కనీసం ఒక్క అవకాశానికి కూడా పనికిరాడా అంటూ  నిలదీస్తున్నారు. మరోపక్క పంత్‌ మాత్రం 27 వన్డేల్లో, 31 టెస్ట్‌ల్లో అవకాశాలు పొంది దర్జాగా జట్టులో కొనసాగుతున్నాడని అంటున్నారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top