‘ఇంగ్లండ్‌తో టెస్టుల్లో అతడిని ఆడించండి.. చుక్కలు చూపిస్తాడు’ | Play Mistery Spinner in England Test series: Navjot Singh Sidhu | Sakshi
Sakshi News home page

‘ఇంగ్లండ్‌తో టెస్టుల్లో అతడిని ఆడించండి.. చుక్కలు చూపిస్తాడు’

Published Fri, Mar 14 2025 10:16 AM | Last Updated on Fri, Mar 14 2025 11:20 AM

Play Mistery Spinner in England Test series: Navjot Singh Sidhu

ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్టు సిరీస్‌ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు (Navjot Singh Sidhu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టోక్స్‌ బృందంపై భారత్‌ తమ అత్యుత్తమ ‘స్పిన్‌’ అస్త్రాన్ని ప్రయోగించాలని సూచించాడు. ‘మిస్టరీ స్పిన్నర్ల’ను ఇంగ్లండ్‌ బ్యాటర్లు ఎదుర్కోలేరని.. వారి బలహీనతను అవకాశంగా మలచుకోవాలని పేర్కొన్నాడు.

కాగా ఇటీవలే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) గెలిచిన టీమిండియా.. రెండున్నర నెలలపాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం కానుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)-2025తో బిజీబిజీగా గడుపనుంది. ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనుంది.

మింగుడుపడని మాత్ర
ఇందులో భాగంగా ఇంగ్లిష్‌ జట్టుతో ఐదు టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు టీమిండియా మేనేజ్‌మెంట్‌కు కీలక సూచనలు చేశాడు. ‘‘మిస్టరీ స్పిన్నర్లను ఎదుర్కోలేకపోవడం ఇంగ్లండ్‌కు ఉన్న అతిపెద్ద బలహీనత. వాళ్లకు ఇది మింగుడుపడని మాత్ర.

ఇంగ్లండ్‌ బ్యాటర్లకు చుక్కలే
మరి అలాంటప్పుడు వరుణ్‌ చక్రవర్తి లేకుండానే ఇంగ్లండ్‌కు వెళ్తారా? లేదు.. లేదు.. కచ్చితంగా అతడి ఇంగ్లండ్‌లో ఆడించాల్సిందే. లేదంటే కుల్దీప్‌ యాదవ్‌నైనా ప్రయోగిస్తారు. ఒకవేళ అతడు చెలరేగిపోయాడంటే.. ఇంగ్లండ్‌కు తిప్పలు తప్పవు.

వరుణ్‌, కుల్దీప్‌.. ఇద్దరూ ఉన్నారంటే ఇంగ్లండ్‌ బ్యాటర్లకు చుక్కలే’’ అని నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు అభిప్రాయపడ్డాడు. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిని ప్రయోగించడం ద్వారా ఇంగ్లిష్‌ బ్యాటర్ల ఆట త్వరగా కట్టించవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.

కాగా టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌ వచ్చిన తర్వాత ‘మిస్టరీ స్పిన్నర్‌’ వరుణ్‌ చక్రవర్తి రాత మారిపోయింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు మెంటార్‌గా ఉన్న సమయంలో ఈ స్పిన్‌ బౌలర్‌ నైపుణ్యాలను గుర్తించిన గౌతీ.. భారత జట్టులో అతడి పునరాగమనానికి మార్గం సుగమం చేశాడు. అయితే, కోచ్‌ పెట్టుకున్న నమ్మకాన్ని వరుణ్‌ నిలబెట్టుకున్నాడు.

చాంపియన్స్‌ ట్రోఫీలోనూ సత్తా చాటి 
స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో దుమ్ములేపి.. వన్డేల్లోనూ అరంగేట్రం చేసిన వరుణ్‌.. చాంపియన్స్‌ ట్రోఫీలోనూ సత్తా చాటాడు. న్యూజిలాండ్‌తో గ్రూప్‌ దశలో ఆఖరి మ్యాచ్‌ సందర్భంగా తుదిజట్టులోకి వచ్చిన ఈ రైటార్మ్‌ లెగ్‌ బ్రేక్ స్పిన్నర్‌.. ఐదు వికెట్లతో దుమ్ములేపాడు.

అనంతరం ఆస్ట్రేలియాతో సెమీస్‌లో రాణించిన వరుణ్‌.. కివీస్‌తో ఫైనల్లోనూ రెండు వికెట్లు తీశాడు. తద్వారా టీమిండియా చాంపియన్‌గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో వరుణ్‌ చక్రవర్తిని టెస్టుల్లోనూ అరంగ్రేటం చేయించాలని నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు బీసీసీఐకి సూచించడం గమనార్హం.

‘తొలి విజయం’ కోసం..
కాగా టీమిండియా గత రెండు టెస్టు సిరీస్‌లలో ఘోర పరాజయం చవిచూసింది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన రోహిత్‌ సేన.. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని 3-1తో చేజార్చుకుంది. 

తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(WTC) ఫైనల్‌ అవకాశాలను పోగొట్టుకుంది. ఇక డబ్ల్యూటీసీ కొత్త ఎడిషన్‌(2025-27)లో ఇంగ్లండ్‌తో తమ ప్రయాణం మొదలుపెట్టనున్న భారత్‌.. భారీ విజయంతో కమ్‌బ్యాక్‌ ఇవ్వాలని భావిస్తోంది. కాగా జూన్‌ 30 నుంచి టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటన మొదలుకానున్నట్టు సమాచారం.

చదవండి: BGT: ‘నేను జట్టులో ఉంటే కచ్చితంగా గెలిచేవాళ్లం.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రెడీ’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement