ఢిల్లీ గడ్డపై తొలిరోజు ఆటలో ఆతిథ్య జట్టు బ్యాటర్ల పనిపట్టిన జమ్మూ కశ్మీర్ రెండో రోజు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటింది. దీంతో రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’లో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో కశీ్మర్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల ఆధిక్యం సంపాదించింది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన జమ్మూ కశ్మీర్ 91.2 ఓవర్లలో 310 పరుగుల వద్ద ఆలౌటైంది.
టాప్–4 బ్యాటర్లు ఇక్బాల్ (14), శుభం (4), వివ్రాంత్ శర్మ (14), సునీల్ (1) వరుసగా విఫలమవడంతో జట్టు ఆరంభంలో తడబడింది. దీంతో 46 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన జమ్మూ కశీ్మర్‌ను కెపె్టన్ పారస్ డోగ్రా (106; 11 ఫోర్లు, 1 సిక్స్) ఆదుకున్నాడు.
రంజీ ట్రోఫీలో పారస్ డోగ్రా 33వ సెంచరీ సాధించి జమ్మూ కశ్మీర్‌కు కీలకమైన ఆధిక్యాన్ని అందించాడు. సహచరుల్లో అబ్దుల్ సమద్ (85; 12 ఫోర్లు, 1 సిక్స్), కన్హయ్య (47; 4 ఫోర్లు) రాణించారు. ఢిల్లీ బౌలర్ సిమర్‌జీత్ సింగ్‌కు 6 వికెట్లు దక్కాయి. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన ఢిల్లీ ఆట ముగిసే సమయానికి 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. అర్పిత్ (2 బ్యాటింగ్), సనత్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
త్రిపుర 602/7 డిక్లేర్డ్
అగర్తలా: గ్రూప్ ‘సి’లో అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో త్రిపుర తొలి ఇన్నింగ్స్‌లో భారీస్కోరు చేసింది. 316/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఆట ప్రారంభించిన త్రిపుర 602/7 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సెంచరీ హీరో హనుమ విహారి (156; 18 ఫోర్లు, 2 సిక్స్‌లు) తన క్రితం రోజు స్కోరుకు కేవలం 13 పరుగులు చేసి నిష్క్రమించగా, విజయ్ శంకర్ (150 నాటౌట్; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతక్కొట్టాడు. రాణా దత్త (51; 8 ఫోర్లు), మురాసింగ్ (51; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆడిన అస్సాం 4 వికెట్లకు 67 పరుగులు చేసింది. అభిజిత్ సర్కార్ 2 వికెట్లు తీశాడు.


