
ఇటీవల జరిగిన తీవ్ర పరిణామాల (పహల్గాం ఉగ్రదాడి, బదులుగా భారత్ ఆపరేషన్ సిందూర్) తర్వాత భారత్, పాక్‌ల మధ్య అన్ని విషయాల్లో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. క్రీడలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి. పాక్‌తో ఏ క్రీడలో అయినా తలపడేందుకు భారత్ నిరాసక్తత వ్యక్తం చేస్తుంది.
అయితే తాజాగా జరుగుతున్న ఓ ప్రచారం భారత క్రీడాభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆసియా కప్, జూనియర్ వరల్డ్‌కప్ టోర్నీల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ హాకీ జట్లు భారత్‌కు రానున్నాయట. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాక్ హాకీ జట్లకు అనుమతి కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది.
వచ్చే నెల (అగస్ట్) 27 నుంచి సెప్టెంబర్ 7 వరకు బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఆసియా కప్ జరుగనుంది. ఈ టోర్నీ కోసం 31 మంది సభ్యుల పాకిస్తాన్ జట్టుకు భారత్‌కు రానున్నట్లు సమాచారం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఓ కీలక అధికారి ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ స్పోర్ట్స్‌స్టార్‌కు చెప్పాడు.
జూనియర్ హాకీ వరల్డ్‌కప్ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు చెన్నై, మధురై నగరాల్లో జరుగనుంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు కూడా పాకిస్తాన్‌కు అనుమతి లభించినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే, భారత్, పాకిస్తాన్ త్వరలో క్రికెట్ ఆసియా కప్‌లో కూడా తలపడాల్సి ఉంది. అయితే, ఈ విషయంపై బీసీసీఐ ఇప్పటివరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించలేదు. ఈ టోర్నీపై ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది క్రికెట్ ఆసియా కప్ సెప్టెంబర్ 5 నుంచి 21వ తేదీ వరకు యూఏఈలో జరగాల్సి ఉంది. ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరుగనుంది. భారత్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.