PAK VS NZ 2nd ODI: పాక్‌ జెర్సీని నేలకేసి కొట్టిన అంపైర్‌

PAK VS NZ 2nd ODI: Mohammad Wasim Jr Accidentally Hits Umpire Aleem Dar - Sakshi

కరాచీ వేదికగా పాకిస్తాన్‌తో నిన్న (జనవరి 11) జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌ 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసుకుం‍ది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. డెవాన్‌ కాన్వే (92 బంతుల్లో 101; 13 ఫోర్లు, సిక్స్‌) సూపర్‌ సెంచరీతో, కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (100 బంతుల్లో 85; 10 ఫోర్లు) హాఫ్‌ సెంచరీతో సత్తా చాటడంతో 49.5 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. నవాజ్‌ (4/38), నసీమ్‌ షా (3/58) కివీస్‌ పతనాన్ని శాశించారు. 

అనంతరం 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 43 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (114 బంతుల్లో 79; 8 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో సౌథీ, సోధీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్‌, సాంట్నర్‌, బ్రేస్‌వెల్‌, ఫిలిప్స్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో పాక్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మూడో వన్డే శుక్రవారం (జనవరి 13) జరుగుతుంది. 

కాగా, ఈ మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ ఊహించని పరిణామం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ సమయంలో (39వ ఓవర్‌లో)పాక్‌ ఆటగాడు మహ్మద్‌ వసీం జూనియర్‌ వికెట్లకు గురిపెట్టి విసిరిన ఓ త్రో ఫీల్డ్‌ అంపైర్‌ అలీం దార్‌ కాలికి బలంగా తాకింది. బంతి తాకిడికి చిర్రెత్తిపోయిన అంపైర్‌, చేతిలో ఉన్న పాక్‌ బౌలర్‌ హరీస్‌ రౌఫ్‌ జెర్సీని నేలకేసి కొట్టాడు. ఆతర్వాత గ్రౌండ్‌లో ఉన్న పాక్‌ ఆటగాళ్లు అంపైర్‌ కాలిని రుద్దుతూ సేవలు చేశారు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డే సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది.

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top