టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌లో ఆడే విషయమై బంగ్లాదేశ్ ఇంత వరకు తమ నిర్ణయాన్ని స్పష్టం చేయలేదు. ఈ అంశంలో బుధవారం (జనవరి 21) వరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తమ వైఖరి ఏమిటో చెప్పాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది.
ముదిరిన వివాదం
కాగా భారత్- బంగ్లాదేశ్ దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. భారత్‌పై బంగ్లా నేతలు అవాకులు, చెవాకులు పేలడం.. ఆ దేశంలో మైనారిటీ హిందువులపై దాడులు జరగడం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తొలగించింది.
దీనిని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ బోర్డు.. ప్రపంచకప్ టోర్నీ ఆడేందుకు భారత్‌కు రాలేమని.. తమ ఆటగాళ్ల భద్రతకు ముప్పు ఉందంటూ కొత్తరాగం ఎత్తుకుంది. తాము ఆడే మ్యాచ్‌లను మరో వేదికైన శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరింది.
కుదరదు
అయితే, ఇప్పటికే భారత్- శ్రీలంకలో జరిగే మ్యాచ్‌లకు ఆయా జట్లు టికెట్లు బుక్ చేసుకోవడం, టోర్నీ ఆరంభానికి తక్కువ సమయం ఉన్నందున బీసీబీ విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చినట్లు సమాచారం.
డెడ్‌లైన్
అయినా సరే బంగ్లాదేశ్ మాత్రం తమ మొండి వైఖరి వీడటం లేదు. ఈ నేపథ్యంలోనే కఠిన చర్యలకు ఉపక్రమించేందుకు సంకల్పించిన ఐసీసీ డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తలదూర్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. పాక్ మీడియా కథనాల ప్రకారం..
బంగ్లాదేశ్ అభ్యర్థనను ఐసీసీ గనుక మన్నించకపోతే.. తాము సైతం టోర్నీ నుంచి వైదొలగాలని పాక్ బోర్డు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఐసీసీ వైఖరిని గట్టిగా వ్యతిరేకించేందుకు పాక్ సిద్ధమైనట్లు తెలిసింది. అయితే, పీసీబీ వర్గాలు తాజాగా ఈ విషయంపై స్పందించాయి.
అబ్బే అదేం లేదు.. మాకేం అవసరం
రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘అబ్బే అదేం లేదు. బంగ్లాదేశ్ విషయంలో అసలు పీసీబీ ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు. అలా చేయడానికి పాకిస్తాన్‌కు అధికారం కూడా లేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారం పాకిస్తాన్ ఇప్పటికే తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడేందుకు సిద్ధమైంది. మరి అలాంటపుడు మాకు వచ్చిన ఇబ్బంది ఏముంది?..
తటస్థ వేదికలపైనే భారత్- పాక్ మ్యాచ్‌లు
బంగ్లాదేశ్- బీసీసీఐ- ఐసీసీ మధ్య జరుగుతున్న విషయాలకు ఆజ్యం పోసేలా కొంతమంది కావాలని ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు’’ అని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గతేడాది చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు కూడా టీమిండియా అక్కడికి వెళ్లలేదు.
తటస్థ వేదికైన దుబాయ్‌లో భారత జట్టు తమ మ్యాచ్‌లు ఆడి చాంపియన్‌గా నిలిచింది. ఐసీసీ చెప్పిన ప్రకారం చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు తటస్థ వేదికను ఏర్పాటు చేసినట్లుగానే.. ఈసారి టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండటంతో పాక్ మ్యాచ్‌లకు శ్రీలంకను వేదికగా ఖరారు చేశారు.
అంతకుముందు మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 టోర్నీ భారత్‌లో జరుగగా.. పాక్ జట్టు తమ మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడింది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 7- మార్చి8 వరకు భారత్-శ్రీలంక వేదికలుగా టీ20 వరల్డ్‌కప్-2026 టోర్నీ జరుగనుంది.
చదవండి: బంగ్లాదేశ్ T20 WC 2026లో ఆడకపోతే స్కాట్లాండ్‌కు అవకాశం!


