టి20 ప్రపంచ కప్‌లో తాము ఆడే మ్యాచ్‌లను భద్రతాకారణాలతో భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) చేస్తున్న డిమాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తుది నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో మ్యాచ్‌ల వేదిక మార్పు సాధ్యం కాదని ఐసీసీ పదేపదే చెబుతున్నా... బీసీబీ మాత్రం తమ మంకు పట్టును వీడటం లేదు. దీంతో ఈ విషయంపై కఠినంగా వ్యవహరించాలని ఐసీసీ భావిస్తోంది. ఈ నెల 21న దీనిపై ఐసీసీ స్పష్టమైన ప్రకటన ఇవ్వనుంది.
తాము వరల్డ్ కప్ ఆడాలా లేదా అనేది బంగ్లాదేశ్ ఆలోపు నిర్ణయం తీసుకోవాలని ఐసీసీ హెచ్చరించింది. లేదంటే టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి ప్రస్తుత ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం తర్వాతి స్థానంలో ఉన్న స్కాట్లాండ్‌కు అవకాశం ఇస్తామని కూడా చెప్పేసింది. తమ గ్రూప్‌ను మార్చి ఐర్లాండ్ మ్యాచ్‌ల స్థానంలో శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడించాలని బీసీబీ చేసిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనకు కూడా అంగీకరించేది లేదని ఐసీసీ జవాబిచి్చంది. భారత్–శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న టి20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది.


