
వింబుల్డన్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో సెర్బియా దిగ్గజం
లండన్: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటలో సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో అడుగు ముందుకేశాడు. వింబుల్డన్ టోర్నీలో ఏడుసార్లు చాంపియన్ జొకోవిచ్ 16వసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ జొకోవిచ్ 1–6, 6–4, 6–4, 6–4తో 11వ సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా)పై నెగ్గాడు. 3 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ తొలి సెట్‌లో కేవలం ఒక గేమ్ మాత్రమే గెలిచాడు. అయితే రెండో సెట్ నుంచి గాడిలో పడ్డ జొకోవిచ్ ప్రత్యరి్థకి ఆధిపత్యం చలాయించే అవకాశం ఇవ్వలేదు.
మ్యాచ్ మొత్తంలో ఆరు ఏస్‌లు సంధించిన జొకోవిచ్ ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 52 సార్లు దూసుకొచ్చి 35 సార్లు పాయింట్లు నెగ్గిన జొకోవిచ్ 38 విన్నర్స్ కొట్టాడు. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్‌ను కూడా ఆరుసార్లు బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా వింబుల్డన్‌లో 101వ విజయం నమోదు చేసిన జొకోవిచ్ కెరీర్‌లో 63వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించాడు.
క్వార్టర్ ఫైనల్లో ఇటలీ ప్లేయర్ ఫ్లావియో కొబోలితో జొకోవిచ్ ఆడతాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కొబోలి 6–4, 6–4, 6–7 (4/7), 7–6 (7/3)తో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై... బెన్ షెల్టన్ (అమెరికా) 3–6, 6–1, 7–6 (7/1), 7–5తో సొనెగో (ఇటలీ)పై, డిఫెండింగ్ చాంపియన్ , రెండో సీడ్ అల్‌కరాజ్ (స్పెయిన్) 6–7 (5/7), 6–3, 6–4, 6–4తో 14వ సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)పై విజయం సాధించారు.