తదుపరి లక్ష్యం ఒలింపిక్‌ పతకం | The next goal is an Olympic medal says Pranavi | Sakshi
Sakshi News home page

తదుపరి లక్ష్యం ఒలింపిక్‌ పతకం

Oct 9 2026 4:14 AM | Updated on Oct 9 2026 4:14 AM

The next goal is an Olympic medal says Pranavi

ఆసియా క్రీడల పసిడి విజేత గోల్ఫర్‌ ప్రణవి వ్యాఖ్య

మేజర్‌ టోర్నీల్లో రాణించేందుకు మెరుగైన సాధన

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పసిడి పతకంతో రికార్డు సృష్టించిన భారత యువ గోల్ఫర్‌ ప్రణవి ఉర్స్‌... ఒలింపిక్‌ పతకం సాధించడంతో పాటు మేజర్‌ టోర్నీల్లో విజేతగా నిలవడమే తన లక్ష్యమని వెల్లడించింది. జపాన్‌ వేదికగా ముగిసిన తాజా ఆసియా క్రీడల్లో మైసూర్‌కు చెందిన 23 ఏళ్ల ప్రణవి స్వర్ణం గెలిచి... గోల్ఫ్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించింది. ఇక 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే తన ముందున్న లక్ష్యమని పేర్కొంది. గురువారం స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొంది. 

ఈ సందర్భంగా ప్రణవి మాట్లాడుతూ... ‘ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించడం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మహిళల యూరోపియన్‌ టూర్‌ (ఎల్‌ఈటీ) టైటిల్‌ గెలవడం ఇక ఎంతో దూరంలో లేదు. ఒలింపిక్‌ పతకం, మేజర్‌ టోర్నీల్లో విజేతగా నిలవడమే నా తదుపరి లక్ష్యం. 2028 జూన్‌ నాటికి లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ అర్హత గడువు ముగుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా వేలాదిమంది ఇందులో పాల్గొనేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ లోపు వీలైనన్ని ఎక్కువ టోర్నమెంట్‌లలో పాల్గొని... ర్యాంకింగ్‌ మెరుగు పరుచుకోవడం ద్వారా విశ్వక్రీడలకు అర్హత సాధించాలనుకుంటున్నా’ అని వెల్లడించింది. 

ఏషియన్‌ గేమ్స్‌ చివరి దశలో ఒత్తిడికి గురైనప్పటికీ... దాన్ని అధిగమించి విజేతగా నిలిచిన ప్రణవి... గోల్ఫ్‌ దిగ్గజం రోరీ మెకిల్రాయ్‌ తనకు అతి పెద్ద స్ఫూర్తి అని పేర్కొంది. ఆసియా క్రీడల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం నెగ్గిన ప్రణవి... అదితీ అశోక్, దీక్ష డాగర్‌తో కలిసి మహిళల టీమ్‌ విభాగంలో దేశానికి రజత పతకం కూడా అందించింది. ‘పతకం నెగ్గిన తర్వాత చాలా మంది నుంచి అభినందిస్తున్నారు. ఇంకా అందులో నుంచి బయటకు రాలేదు. ఫోన్స్, ఎస్‌ఎంఎస్‌లతో బిజీ అయిపోయా. ఇది నాకు చాలా కొత్తగా ఉంది. గతంలో ఎన్నో టోర్నీలు గెలిచినా ఇలాంటి స్పందన రాలేదు. దేశం తరఫున పతకం గెలవడం చాలా గర్వంగా ఉంది. ఆసియా క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన తొలిసారే విజేతగా నిలవడం ఆనందంగా ఉంది. దీని కోసం గత మూడేళ్లుగా ఎంతో కష్టపడ్డా. చివరకు ఫలితం దక్కింది’ అని ప్రణవి వివరిచింది. 

ఈ నెల 22 నుంచి గురుగ్రామ్‌ వేదికగా జరగనున్న ‘హీరో ఉమెన్స్‌ ఇండియన్‌ ఓపెన్‌’లో ప్రణవి పాల్గొననుంది. దీంతో పాటు ఈ ఏడాది మరో మూడు ఎల్‌ఈటీ ఈవెంట్‌లలో బరిలోకి దిగనున్నట్లు ప్రణవి వెల్లడించింది. ‘ఆసియా క్రీడల పతకంతో నాపై బాధ్యత మరింత పెరిగింది. దాన్ని నిలబెట్టుకునేందుకు శాయశక్తులా కృషిచేస్తా. బరిలోకి దిగిన ఏ టోర్నీలో అయినా విజయం సాధించడమే లక్ష్యంగా షాట్‌లు ఆడుతా. కొన్నిసార్లు అవి లక్ష్యానికి చేరకపోయినా... అక్కడితో ఆగిపోను. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకొని మరింత మెరుగయ్యేందుకు కృషి చేస్తా’ అని ప్రణవి పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement