వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. ఆదివారం క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో విండీస్‌పై 7 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.
బ్లాక్ క్యాప్స్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ (118 బంతుల్లో 119; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత సెంచరీతో చెలరేగగా.. డెవాన్ కాన్వే (58 బంతుల్లో 49; 7 ఫోర్లు, 1 సిక్స్) ఆర్ధ శతకంతో రాణించాడు. టాపార్డర్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర (4), విల్ యంగ్ (0) విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. మాథ్యూ ఫోర్డ్ రెండు, గ్రీవ్స్, చేజ్ తలా వికెట్ సాధించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 262 పరుగులే చేయగలిగింది.
షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ (61 బంతుల్లో 55; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), గ్రీవ్స్ (24 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ షై హోప్ (37; 2 ఫోర్లు, 1 సిక్స్), కీసీ కార్టి (32; 2 ఫోర్లు), అతానెజ్ (29; 2 ఫోర్లు, 1 సిక్స్), రొమారియో షెఫర్డ్ (26 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) సమష్టిగా రాణించడంతో గెలిచే స్థితిలో నిలిచింది. కానీ ఆఖరి 12 బంతుల్లో 32 పరుగుల సమీకరణాన్ని సాధించలేకపోయింది. చివరి రెండు ఓవర్లలో కరేబియన్ జట్టు 24 పరుగులు సాధించి ఓటమి పాలైంది. జేమీసన్ కీలక వికెట్లు పడగొట్టగా, హెన్రీ, ఫౌక్స్, సాన్‌ట్నర్ తలా ఒక వికెట్ తీశారు.
చదవండి: IND vs SA: ఆస్పత్రి నుంచి గిల్ డిశ్చార్జ్.. రెండో టెస్టుకు డౌటే


