కివీస్‌ గెలుపు జోరు... | ICC ODI WC 2023 NZ Vs NED: New Zealand Beat Netherlands By 99 Runs, Check Full Score Details Inside - Sakshi
Sakshi News home page

CWC 2023 NZ Vs NED Highlights: కివీస్‌ గెలుపు జోరు...

Oct 10 2023 4:02 AM | Updated on Oct 10 2023 9:19 AM

New Zealand beat Netherlands by 99 runs - Sakshi

ప్రపంచకప్‌లో మరో ఏకపక్ష విజయం...  గత టోర్నీ రన్నరప్‌ న్యూజిలాండ్‌ సమష్టి ప్రదర్శన ముందు అసోసియేట్‌ టీమ్‌  నెదర్లాండ్స్‌ నిలవలేకపోయింది... బ్యాటింగ్‌ పిచ్‌పై ముందుగా భారీ స్కోరు నమోదు చేసిన న్యూజిలాండ్‌ విసిరిన సవాల్‌కు పసికూన నెదర్లాండ్స్‌ వద్ద జవాబు లేకపోయింది... ఫలితంగా కివీస్‌ ఖాతాలో  వరుసగా రెండో విజయం చేరగా...  హైదరాబాద్‌ వేదికగా ఆడిన రెండు మ్యాచుల్లోనూ డచ్‌ బృందానికి ఓటమే ఎదురైంది. బ్యాటింగ్‌లో విల్‌ యంగ్, లాథమ్, రచిన్‌ రవీంద్ర, బౌలింగ్‌లో సాన్‌ట్నర్‌ న్యూజిలాండ్‌ విజయసారథులుగా నిలిచారు.  

సాక్షి, హైదరాబాద్‌: న్యూజిలాండ్‌ జట్టు తమపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ మళ్లీ సత్తా చాటింది. విడిగా చూస్తే విధ్వంసక ప్రదర్శనలు లేకపోయినా... ప్రతీ ఒక్కరూ రాణించడంతో క్వాలిఫయర్‌ జట్టు నెదర్లాండ్స్‌పై కివీస్‌ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సోమవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన పోరులో న్యూజిలాండ్‌ 99 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. విల్‌ యంగ్‌ (80 బంతుల్లో 70; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), టామ్‌ లాథమ్‌ (46 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్‌), రచిన్‌ రవీంద్ర (51 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు సాధించగా... డరైల్‌ మిచెల్‌ (47 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు.

అనంతరం నెదర్లాండ్స్‌ 46.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కొలిన్‌ అకెర్‌మన్‌ (73 బంతుల్లో 69; 5 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మిచెల్‌ సాన్‌ట్నర్‌ (5/59) ఉప్పల్‌ స్టేడియంలో వన్డేల్లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు.  

సమష్టి బ్యాటింగ్‌తో... 
ఆశ్చర్యకర రీతిలో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ బాగా నెమ్మదిగా ప్రారంభమైంది. తొలి మూడు ఓవర్లూ ఒక్క పరుగు లేకుండా మెయిడిన్లుగా ముగియడం విశేషం. అయితే ఆ తర్వాత జట్టు ధాటిని పెంచింది. కాన్వే (40 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్‌), యంగ్‌ చక్కటి బ్యాటింగ్‌తో తర్వాతి 7 ఓవర్లలో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు రాబట్టారు. ఈ జోడీ విడిపోయిన తర్వాత వచ్చిన రచిన్‌ తన ఫామ్‌ను కొనసాగించాడు. 59 బంతుల్లో యంగ్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, రచిన్‌కు హాఫ్‌ సెంచరీ కోసం 50 బంతులే సరిపోయాయి. మరో ఎండ్‌లో మిచెల్‌ కూడా జోరు ప్రదర్శించాడు.

కానీ ఈ దశలో డచ్‌ బౌలర్లు ప్రత్యర్థిని కొద్దిసేపు నిలువరించారు. 16 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు తీసి దెబ్బ కొట్టారు. అయితే మరోవైపు లాథమ్‌ దూకుడు కివీస్‌ స్కోరును 300 వందలు దాటించింది. సాన్‌ట్నర్‌ (17 బంతుల్లో 36 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా చెలరేగడంతో చివర్లో భారీ స్కోరు చేయడంలో న్యూజిలాండ్‌ సఫలమైంది. ఆఖరి 10 ఓవర్లలో 84  పరుగులు సాధించిన న్యూజిలాండ్‌ వీటిలో చివరి 3 ఓవర్లలోనే 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 పరుగులు రాబట్టడం విశేషం.  
 

అకెర్‌మన్‌ మినహా... 
భారీ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ఏ దశలోనూ నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌ వేగంగా సాగలేదు. పాక్‌తో మ్యాచ్‌తో పోలిస్తే జట్టు బ్యాటింగ్‌ ఈ సారి పేలవంగా కనిపించింది. ఓపెనర్లు విక్రమ్‌జిత్‌ (12), డౌడ్‌ (16) విఫలం కాగా, అకెర్‌మన్‌ ఒక్కడే  పోరాడగలిగాడు. అకెర్‌మన్, తేజ నిడమనూరు (26 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మధ్య నమోదైన 50 పరుగుల భాగస్వామ్యమే ఈ ఇన్నింగ్స్‌లో పెద్దది.

క్రీజ్‌లో నిలదొక్కుకొని చక్కటి షాట్లతో జోరుపెంచిన దశలో తేజ లేని రెండో పరుగు కోసం అనవసరంగా ప్రయత్నించాడు.  అకెర్‌మన్‌తో సమన్వయ లోపంతో అతను రనౌటయ్యాడు. 55 బంతుల్లో అకెర్‌మన్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. చివర్లో స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్‌), సైబ్రాండ్‌ (34 బంతుల్లో 29; 3 ఫోర్లు) కొంత వరకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. లక్ష్యానికి చాలా దూరంలో నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.  

స్కోరు వివరాలు 
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: కాన్వే (సి) డి లీడ్‌ (బి) వాండర్‌ మెర్వ్‌ 32; యంగ్‌ (సి) డి లీడ్‌ (బి) మీకెరెన్‌ 70; రచిన్‌ (సి) ఎడ్వర్డ్స్‌ (బి) వాండర్‌ మెర్వ్‌ 51; మిచెల్‌ (బి) మీకెరెన్‌ 48; లాథమ్‌ (స్టంప్డ్‌) ఎడ్వర్డ్స్‌ (బి) దత్‌ 53; ఫిలిప్స్‌ (సి) ఎడ్వర్డ్స్‌ (బి) డి లీడ్‌ 4; చాప్‌మన్‌ (సి) వాండర్‌ మెర్వ్‌ (బి) దత్‌ 5; సాన్‌ట్నర్‌ (నాటౌట్‌) 36; హెన్రీ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 322. వికెట్ల పతనం: 1–67, 2–144, 3–185, 4–238, 5–247, 6–254, 7–293. బౌలింగ్‌: ఆర్యన్‌ దత్‌ 10–2–62–2, ర్యాన్‌ క్లీన్‌ 7–1–41–0, మీకెరెన్‌ 9–0–59–2, వాండర్‌ మెర్వ్‌ 9–0–56–2, అకెర్‌మన్‌ 4–0–28–0, డి లీడ్‌ 10–0–64–1, విక్రమ్‌జిత్‌ 1–0–9–0.  

నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌: విక్రమ్‌జిత్‌ (బి) హెన్రీ 12; డౌడ్‌ (ఎల్బీ) (బి) సాన్‌ట్నర్‌ 16; అకెర్‌మన్‌ (సి) హెన్రీ (బి) సాన్‌ట్నర్‌ 69; డి లీడ్‌ (సి) బౌల్ట్‌ (బి) రచిన్‌ 18; తేజ (రనౌట్‌) 21; ఎడ్వర్డ్స్‌ (సి అండ్‌ బి) సాన్‌ట్నర్‌ 30; సైబ్రాండ్‌ (సి) కాన్వే (బి) హెన్రీ 29; వాండర్‌మెర్వ్‌ (సి) హెన్రీ (బి) సాన్‌ట్నర్‌ 1; క్లీన్‌ (ఎల్బీ) (బి) సాన్‌ట్నర్‌ 8; ఆర్యన్‌ దత్‌ (బి) హెన్రీ 11; మీకెరెన్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (46.3 ఓవర్లలో ఆలౌట్‌) 223. వికెట్ల పతనం: 1–21, 2–43, 3–67, 4–117, 5–157, 6–174, 7–180, 8–198, 9–218, 10–223. బౌలింగ్‌: బౌల్ట్‌ 8–0–34–0, హెన్రీ 8.3–0–40–3, సాన్‌ట్నర్‌ 10–0–59–5, ఫెర్గూసన్‌ 8–0–32–0, రచిన్‌ 
రవీంద్ర 10–0–46–1, ఫిలిప్స్‌ 2–0–11–0.   

ప్రపంచకప్‌లో నేడు
ఇంగ్లండ్‌ X బంగ్లాదేశ్‌ 
వేదిక: ధర్మశాల 
ఉదయం గం. 10:30 నుంచి  

పాకిస్తాన్‌  X శ్రీలంక 
వేదిక: హైదరాబాద్‌ 
మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement