WTC Final: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన క్రికెటర్‌

New Zealand Batsman Henry Nicholls Marries Girlfriend Ahead WTC Final  - Sakshi

ఆక్లాండ్‌: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ముంగిట న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ హెన్రీ నికోల్స్‌ ఒక ఇంటివాడయ్యాడు. కొంతకాలంగా లూసీ అనే అమ్మాయితో రిలేషిన్‌షిప్‌లో ఉన్న హెన్రీ ఆదివారం ఆమెను వివాహమాడాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకున్న నికోలస్‌ వారి వెడ్డింగ్‌ ఫోటోను పంచుకున్నాడు.'' మీ అందరికి ఒక గుడ్‌న్యూస్‌.. ఈరోజు నా గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్నా.. ఇప్పుడు మేము.. మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ నికోలస్‌గా మారాం.. ఈ ఉత్సాహంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సిద్ధమవుతున్నా'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ఇక టీమిండియా, కివీస్‌ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ జూన్‌ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌ వేదికగా జరగనుంది. కాగా నికోలస్‌ వచ్చే వారం జట్టుతో కలవనున్నాడు.

ఇక కివీస్‌ ఆటగాడు హెన్రీ నికోల్స్‌ అనగానే మనందరికి ముందుగా గుర్తుకు వచ్చేది ఐసీసీ 2019 ప్రపంచకప్‌ ఫైనల్‌. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో నికోలస్‌ 55 పరుగులతో జట్టు తరపున టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అయితే దురదృష్టవశాత్తూ న్యూజిలాండ్‌ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఇక 2019 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత బెస్ట్‌ మ్యాచ్‌గా నిలిచిపోయింది. సూపర్‌ ఓవర్‌ కూడా టై కావడం.. బౌండరీ కౌంట్‌ ద్వారా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడం చరిత్రలో నిలిచిపోయింది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. నికోల్స్‌ 55, విలియమ్సన్‌ 30,చివర్లో టామ్‌ లాథమ్‌ 47 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 81 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన బెన్‌ స్టోక్స్‌(84 నాటౌట్‌) అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడగా.. బట్లర్‌ 59 పరుగులతో సహకరించాడు. ఆఖరివరకు నిలిచిన స్టోక్స్‌ మ్యాచ్‌ను టై చేశాడు. దీంతో ఫలితం కోసం సూపర్‌ ఓవర్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. సూపర్‌ ఓవర్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ వికెట్‌ నష్టానికి 15 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్‌ కూడా 15 పరగులే చేయడంతో మరోసారి టైగా ముగిసింది. దీంతో ఇన్నింగ్స్‌లో ఎక్కువ బౌండరీలు(22) సాధించిన ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు. 
చదవండి: ఈ వ్యక్తిని అందుకోవడం కష్టంగా ఉంది : వార్నర్‌
ఆ క్రికెటర్‌తోనే నా కూతురు పెళ్లి: పాక్‌ మాజీ క్రికెటర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top