ఈ వ్యక్తిని అందుకోవడం కష్టంగా ఉంది : వార్నర్‌

David Warner Reacts Most International Tons We Aint Catching Virat Kohli - Sakshi

సిడ్నీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని మెషిన్‌ గన్‌ అని ముద్గుగా పిలుస్తుంటారు. క్రికెట్‌ భాషలో చెప్పాలంటే పరుగుల యంత్రం అని అర్థం. చేజింగ్‌ మాస్టర్‌గా పరిగణించే కోహ్లి అనతి కాలంలో ఉత్తమ బ్యాట్స్‌మెన్లలో ఒకడిగా నిలిచాడు. టీమిండియా తరపున 254 వన్డేల్లో 12169 పరుగులు, 91 టెస్టుల్లో 7490 పరుగులు, 89 టీ20ల్లో 3159 పరుగులు సాధించాడు. ఇక టీ20ల్లో ఇప్పటివరకు సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయిన కోహ్లి వన్డేల్లో 43, టెస్టుల్లో 27 సెంచరీలతో దుమ్మురేపాడు. ఓవరాల్‌గా 70 సెంచరీలతో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.  కోహ్లి కంటే ముందు సచిన్‌(100 సెంచరీలు), పాంటింగ్‌(71 సెంచరీలు) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. అయితే ఇప్పటికే వీరిద్దరు ఆటకు గుడ్‌బై చెప్పడంతో కోహ్లి త్వరలోనే అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలుస్తాడేమో చూడాలి.

తాజాగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆసీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ విరాట్‌ కోహ్లిని ప్రశంసల్లో ముంచెత్తాడు. ఐపీఎల్‌ 14వ సీజన్‌ రద్దు కావడంతో ఆసీస్‌ చేరుకున్న వార్నర్‌ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో వార్నర్‌  తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ తరంలో అత్యధిక సెంచరీలు చేసిన 10 మంది ఆటగాళ్ల  లిస్ట్‌ను షేర్‌ చేశాడు. ''లిస్ట్‌లో ఉన్న వాళ్లంతా ఇంకా క్రికెట్‌ ఆడుతున్నారు.. ఎవరు రిటైర్‌ కాలేదు.. ఒకసారి పరిశీలించండి'' అంటూ వార్నర్‌ రాసుకొచ్చాడు. ఇక లిస్ట్‌లో కోహ్లి 70 సెంచరీలతో ఎవరికి అందనంత ఎత్తులో నిలవగా.. రెండో స్థానంలో వార్నర్‌(43), క్రిస్‌ గేల్‌(42 సెంచరీలతో మూడో స్థానం), రోహిత్‌ శర్మ( 40 సెంచరీలతో నాలుగో స్థానం), రాస్‌ టేలర్‌( 40 సెంచరీలతో ఐదో స్థానం)లో ఉన్నారు. ఆ తర్వాత స్మిత్‌,విలిమమ్సన్‌, రూట్‌, ధావన్‌, డుప్లెసిస్‌లు ఉన్నారు. కాగా వార్నర్‌ షేర్‌ చేసిన ఫోటోలో కోహ్లిని మార్క్‌ చేసి.. ''ఇదిగో ఈ వ్యక్తిని అందుకోవడం మాకు కష్టంగా ఉంది.. మాకు అందనంత దూరంలో ఉన్నాడు. ఈ మిషన్‌గన్‌ను ఆపడం ఎలా'' అంటూ ఫన్నీ క్యాప్షన్‌ జత చేశాడు.


అయితే కోహ్లి మాత్రం 2019 నుంచి ఒక్క ఫార్మాట్‌లోనూ సెంచరీ ఫీట్‌ను సాధించలేకపోయాడు. 2019 ఆగస్టులో విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రెండుసార్లు సెంచరీ మార్క్‌ను అందుకున్న కోహ్లి ఆ తర్వాత మాత్రం ఒక్కసారి కూడా శతకాన్ని అందుకోలేకపోయాడు. కరోనా ఎఫెక్ట్‌ కారణంగా 2020లో మ్యాచ్‌లు ఆడే అవకాశం ఎక్కువగా రాకపోవడం.. ఆ తర్వాత జరిగిన ఆసీస్‌, ఇంగ్లండ్‌ సిరీస్‌ల్లోనూ సెంచరీని అందుకోవడం విఫలమయ్యాడు. ఇక కోహ్లి నేతృత్వంలోని టీమిండియా.. న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడేందుకు జూన్‌ 2న ఇంగ్లండ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆడనుంది.
చదవండి: గుండెపోటుతో క్రికెట్‌ కోచ్‌ కన్నుమూత.. విషాదంలో  కోహ్లి

'రాములో రాములా' పాటకు వార్నర్‌ డ్యాన్స్‌.. ట్రోల్‌ చేసిన భార్య

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top