ఐపీఎల్‌ ఫ్రాంఛైజీకి గుడ్‌బై.. టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా! | Is Morne Morkel Confirmed as India Bowling Coach LSG Link Reveals: Report | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీకి గుడ్‌బై.. టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా!

Jul 26 2024 6:31 PM | Updated on Jul 26 2024 6:48 PM

Is Morne Morkel Confirmed as India Bowling Coach LSG Link Reveals: Report

గంభీర్‌తో మోర్నీ మోర్కెల్‌ (PC: LSG/IPL)

టీమిండియా బౌలింగ్‌ కొత్త కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ మోర్నీ మోర్కెల్‌ ఎంపిక ఖరారైనట్లు సమాచారం. నూతన హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ సహాయక సిబ్బందిలో చేరేందుకు మోర్కెల్‌ మార్గం సుగమం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రొటిస్‌ పేస్‌ దళంలో కీలక బౌలర్‌గా సేవలు అందించిన మోర్నీ మోర్కెల్‌.. గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌తో బంధం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌గా గౌతం గంభీర్‌ వ్యవహరించిన సమయంలో ఆ జట్టు కీలక పేసర్లలో మోర్కెల్‌ ఒకడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ లక్నో సూపర్‌ జెయింట్స్‌లో కలిసి పనిచేశారు. లక్నో మెంటార్‌గా గంభీర్‌ వ్యవహరించగా.. బౌలింగ్‌ కోచ్‌గా మోర్కెల్‌ ఉన్నాడు.

అనంతరం గంభీర్‌ కేకేఆర్‌ మెంటార్‌గా మారగా.. మోర్కెల్‌ మాత్రం ఐపీఎల్‌-2024లోనూ లక్నోతోనే కొనసాగాడు. తాజాగా ఫ్రాంఛైజీతో బంధం తెంచుకునేందుకు మోర్నీ మోర్కెల్‌ సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా నియమితుడయ్యే క్రమంలోనే 39 ఏళ్ల మోర్కెల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత జట్టు కోచ్‌గా పనిచేయాలంటే.. ఇతర బాధ్యత(క్రికెట్‌కు సంబంధించిన)ల నుంచి సదరు వ్యక్తులు వైదొలగాలన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే గంభీర్‌ కేకేఆర్‌ను వీడగా.. ఇప్పుడు మోర్నీ మోర్కెల్‌ కూడా అదే బాటలో నడవాలని నిర్ణయించుకున్నట్లు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌ వెల్లడించింది. 

టీమిండియా శ్రీలంక పర్యటన తర్వాత టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా మోర్నె మోర్కెల్‌ నియామకానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా తన తండ్రి అనారోగ్యం దృష్ట్యా మోర్కెల్‌ ప్రస్తుతం సౌతాఫ్రికాలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. జూలై 27 నుంచి శ్రీలంక- టీమిండియా మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ మొదలుకానుంది. ఇరు జట్ల మధ్య తొలుత మూడు టీ20లు.. తర్వాత మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ జరుగనుంది. 

ఈ టూర్‌తో టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్‌ ప్రస్థానం ఆరంభం కానుంది. ఇక ఈ పర్యటనలో టీమిండియా బౌలింగ్‌ తాత్కాలిక కోచ్‌ సాయిరాజ్‌ బహుతులే ఎంపికయ్యాడు. కేకేఆర్‌లో గౌతీ సహచరులు అభిషేక్‌ నాయర్‌, ర్యాన్‌ టెన్‌ డష్కాటే అసిస్టెంట్‌ కోచ్‌లుగా పనిచేయనుండగా.. ఫీల్డింగ్‌ కోచ్‌గా టి.దిలీప్‌ రీఎంట్రీ ఇచ్చాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement