
టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి బాటలోనే మహ్మద్ షమీ కూడా పయనిస్తున్నాడని గత కొన్ని గంటలుగా ప్రచారం జరుగుతుంది. రోహిత్, విరాట్ లాగే షమీ కూడా టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై షమీ తాజాగా స్పందించాడు.
Mohammad Shami squashes retirement rumours. pic.twitter.com/PoKqLoS42l
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 13, 2025
తన రిటైర్మెంట్‌పై ఓ ఇంగ్లిష్ వెబ్‌సైట్‌లో రాసిన వార్తను ఖండిస్తూ.. దాన్ని రాసిన వ్యక్తికి మొట్టికాయలు వేశాడు. ముందు నీ ఉద్యోగానికి వీడ్కోలు పలకడానికి రోజులు లెక్క పెట్టుకో. తర్వాత నా రిటైర్మెంట్ గురించి మాట్లాడవచ్చు. నీ లాంటి వాళ్లు మీడియాను సర్వనాశనం చేశారు.
ఆటగాళ్ల భవితవ్యం గురించి ఒక్కసారైనా మంచిగా చెప్పండి. ఈ రోజుకు ఇది చాలా చెత్త వార్త. సారీ అంటూ తన సోషల్‌మీడియా ఖాతాలో రాసుకొచ్చాడు. తన రిటైర్మెంట్‌పై దుష్ప్రచారం చేసిన వ్యక్తికి గట్టిగా ఇస్తూనే షమీ సదరు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించాడు.
కాగా, 34 ఏళ్ల షమీ గత కొంతకాలంగా ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటూ టీమిండియాలో స్థిరపడలేకపోతున్నాడు. ఇదే కారణంగా షమీని త్వరలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేయరని ప్రచారం సాగింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గాయం నుంచి కోలుకుని టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన షమీ మునుపటి జోరును కొనసాగించలేకపోయాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో అడపాదడపా ప్రదర్శనతో సరిపెట్టిన అతను ఐపీఎల్-2025లో దారుణంగా విఫలమయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ షమీని గంపెడాశలతో సొంత చేసుకుంటే అతను కనీస న్యాయం చేయలేకపోయాడు. ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన తర్వాత షమీ వ్యతిరేకుల స్వరం పెద్దదైంది.
ఇంగ్లండ్ పర్యటనకు అతన్ని ఎంపిక చేయొద్దంటూ కొందరు సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. షమీ స్థానంలో ఐపీఎల్‌లో ఇరగదీస్తున్న ప్రసిద్ద్ కృష్ణను ఎంపిక చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలనుకుంటే ప్రత్యామ్నాయ పేసర్లుగా అర్షదీప్ సింగ్, సిరాజ్, ఖలీల్ అహ్మద్‌ను ఎంపిక చేయాలని కోరుతున్నారు.
ఇదిలా ఉంటే, 2023 వన్డే ప్రపంచకప్ వరకు అద్భుతంగా రాణించిన షమీ.. ఆతర్వాత గాయం తాలూకా సమస్యలతో ఢీలా పడిపోయాడు. భారత్‌లో జరిగిన 2023 వన్డే ప్రపంచకప్‌లో షమీ టీమిండియాను ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు. ఆ మెగా టోర్నీలో అతను 7 మ్యాచ్‌ల్లో ఏకంగా 24 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. తన కెరీర్‌లో 64 టెస్ట్‌లు, 108 వన్డేలు, 25 టీ20లు ఆడిన షమీ 462 వికెట్లు తీశాడు.