యాషెస్ సిరీస్‌కు ముందు ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ప్రత్యర్ధి ఇంగ్లండ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ మెసేజ్ పంపాడు. యాషెస్ సన్నాహకాల్లో భాగంగా షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ ఆడుతున్న అతడు (న్యూ సౌత్ వేట్స్).. విక్టోరియాపై 4 వికెట్ల ప్రదర్శనలతో చెలరేగాడు. తొలి రోజు ఆటలో ఇది జరిగింది.
ఆట ప్రారంభం నుంచే నిప్పులు చెరిగిన స్టార్క్.. ఓపెనర్లు క్యాంప్‌బెల్ కెల్లావే (51), హ్యారీ డిక్సన్ (20) సహా కీలకమైన ఒలివర్ పీక్ (0), సామ్ హార్పర్ (54) వికెట్లు తీశాడు. స్టార్క్‌తో పాటు నాథన్ లియోన్ (22-1-65-2), సీన్ అబాట్ (18-1-70-1) కూడా రాణించడంతో న్యూ సౌత్ వేల్స్ తొలి రోజు ఆటలో 7 వికెట్లు తీసింది.
ఆట ముగిసే సమయానికి విక్టోరియా 340 పరుగులు చేసింది. కెప్టెన్ విల్ సదర్‌ల్యాండ్ (36), సామ్ ఇలియట్ (4) క్రీజ్‌లో ఉన్నారు. పీటర్ హ్యాండ్స్‌కోంబ్ (104) సెంచరీ సాధించి, విక్టోరియా ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. న్యూ సౌత్ వేల్స్‌కే ఆడుతున్న మరో ఆసీస్ స్పీడ్‌స్టర్ జోష్ హాజిల్‌వుడ్ తొలి రోజు వికెట్ తీయలేకపోయాడు. హాజిల్‌వుడ్ ప్రత్యర్ది బ్యాటర్లను ఇబ్బంది పెట్టినా వికెట్ లేకుండా మిగిలాడు.
షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో స్టార్క్, హాజిల్‌వుడ్, నాథన్ లియోన్ సహా ఆసీస్ జట్టు సభ్యులంతా పాల్గొంటున్నారు.
ఇవాళే ప్రారంభమైన మరో మ్యాచ్‌లో సౌత్ ఆస్ట్రేలియా, టస్మానియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టస్మానియా.. బ్రెండన్ డాగ్గెట్ (19.2-4-66-5), లియామ్ స్కాట్ (18-5-46-3), మెక్ ఆండ్రూ (16-2-54-1), థార్న్‌టన్ (10-2-31-1) ధాటికి 209 పరుగులకే ఆలౌటైంది.
టస్మానియా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సిల్క్ (64) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. యాషెస్ తొలి టెస్ట్ జట్టులో సభ్యుడైన బ్యూ వెబ్‌స్టర్ 13 పరుగులకే ఔటై నిరాశపరిచాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. మెక్‌స్వీని (2), జేసన్ సంఘా (12), ట్రవిస్ హెడ్ (9) ఔట్ కాగా.. హెన్రీ హంట్ (34), అలెక్స్ క్యారీ (25) క్రీజ్‌లో ఉన్నారు.
చదవండి: బీసీసీఐ చారిత్రక నిర్ణయం..!


