WTC Final 2025: చరిత్ర సృష్టించిన స్టార్క్‌.. షమీ రికార్డును చెరిపేశాడు | Mitchell Starc Breaks Mohammed Shami’s Record, Creates History In ICC Final | Sakshi
Sakshi News home page

WTC Final 2025: చరిత్ర సృష్టించిన స్టార్క్‌.. షమీ రికార్డును చెరిపేశాడు

Jun 12 2025 12:34 PM | Updated on Jun 12 2025 12:58 PM

Mitchell Starc Breaks Mohammed Shami’s Record, Creates History In ICC Final

ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ టీమిండియా స్టార్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ పేరిట ఉన్న ఓ ఆల్‌టైమ్‌ రికార్డును చెరిపేశాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న 2023-2025 డబ్ల్యూటీసీ ఫైనల్లో 2 వికెట్లు తీయడంతో ఐసీసీ ఫైనల్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. స్టార్క్‌ ఇప్పటివరకు 5 ఐసీసీ ఫైనల్స్‌ ఇన్నింగ్స్‌ల్లో 11 వికెట్లు తీశాడు. 2015 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో రెండు వికెట్లు తీసిన స్టార్క్‌.. 2021-23 డబ్ల్యూటీసీ ఫైనల్లో నాలుగు, 2023 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో మూడు, ప్రస్తుతం జరుగుతున్న 2023-25 డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండు వికెట్లు తీశాడు.

గతంలో ఈ రికార్డు షమీ పేరిట ఉండేది. షమీ ఐసీసీ ఫైనల్స్‌లో 6 ఇన్నింగ్స్‌ల్లో 10 వికెట్లు తీశాడు. ఐసీసీ ఫైనల్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో స్టార్క్‌, షమీ తర్వాతి స్థానాల్లో ట్రెంట్‌ బౌల్ట్‌ (5 ఇన్నింగ్స్‌ల్లో 8 వికెట్లు), రవీంద్ర జడేజా (10 ఇన్నింగ్స్‌ల్లో 8), కైల్‌ జేమీసన్‌ (3 ఇన్నింగ్స్‌ల్లో 8) ఉన్నారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఇంగ్లండ్‌లోని లార్డ్స్‌ మైదానం వేదికగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25 ఫైనల్‌ జరుగుతుంది. నిన్న (జూన్‌ 11) మొదలైన ఈ టైటిల్‌ పోరులో సౌతాఫ్రికా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.  

రబాడ (5/51), జన్సెన్‌ (3/49),  కేశవ్‌ మహారాజ్‌ (1/19), మార్క్రమ్‌ (1/5) చెలరేగడంతో ఆసీస్‌ రెండు సెషన్లలోపే 212 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్‌ స్మిత్‌ (66), బ్యూ వెబ్‌స్టర్‌ (72) అర్ద సెంచరీలతో ఆదుకోవడంతో ఆసీస్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 

మిగతా ఆసీస్‌ బ్యాటర్లలో అలెక్స్‌ క్యారీ (23), లబూషేన్‌ (17), ట్రవిస్‌ హెడ్‌ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. గ్రీన్‌ (4), కమిన్స్‌ (1), స్టార్క్‌ (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. ఉస్మాన్‌ ఖ్వాజా, నాథన్‌ లియోన్‌ డకౌట్లయ్యారు.

ఆసీస్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసిన ఆనందం సౌతాఫ్రికాకు ఎంతో సేపు నిలబడలేదు. తొలి ఓవర్‌నే వికెట్‌ (మార్క్రమ్‌) కోల్పోయిన ఆ జట్టు మరో 20 ఓవర్ల వ్యవధిలో కేవలం 30 పరుగులు మాత్రమే చేసి మొత్తం నాలుగు వికెట్లు చేజార్చుకుంది. 

స్టార్క్‌ (2/10), హాజిల్‌వుడ్‌ (1/10), కమిన్స్‌ (1/14) నిప్పులు చెరిగే బంతులతో సౌతాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఒక్కో పరుగు చేసేందుకు సౌతాఫ్రికా బ్యాటర్లు నానా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న బవుమా అయితే ఖాతా తెరిచేందుకు ఏకంగా 31 బంతులు తీసుకున్నాడు. 

సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్క్రమ్‌ డకౌట్‌ కాగా.. రికెల్టన్‌ 16, ముల్దర్‌ 6, స్టబ్స్‌ 2 పరుగులకు ఔటయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా స్కోర్‌ 43/4గా ఉంది. బవుమాతో (3) పాటు బెడింగ్హమ్‌ (8) క్రీజ్‌లో ఉన్నాడు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు సౌతాఫ్రికా ఇంకా 169 పరుగులు వెనుకపడి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement