
ఫెల్ప్స్ రికార్డుపై కెనడా స్టార్ స్విమ్మర్ గురి
మర్చండ్ ఖాతాలో స్వర్ణం
సింగపూర్: ఈత కొలనులో తనకు తిరుగులేదని కెనడా టీనేజ్ స్టార్ స్విమ్మర్ సమ్మర్ మెకింటోష్ మరోసారి చాటుకుంది. ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తన జోరు కొనసాగిస్తూ 18 ఏళ్ల మెకింటోష్ మూడో స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో జమ చేసుకుంది. గురువారం జరిగిన మహిళల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఫైనల్లో మెకింటోష్ 2 నిమిషాల 01.99 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. ఈ చాంపియన్‌షిప్‌లో ఇప్పటికే మెకింటోష్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్, 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ విభాగాల్లో బంగారు పతకాలు సొంతం చేసుకుంది.
800 మీటర్ల ఫ్రీస్టయిల్, 400 మీటర్ల మెడ్లీ ఈవెంట్స్‌లో మెకింటోష్ బరిలోకి దిగాల్సి ఉంది. ఈ రెండింటిలోనూ మెకింటోష్ స్వర్ణాలు సాధిస్తే... ఒకే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అత్యధికంగా 5 స్వర్ణ పతకాలు సాధించిన స్విమ్మర్‌గా మైకేల్ ఫెల్ప్స్ (అమెరికా; 2007లో) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును మెకింటోష్ సమం చేస్తుంది. గత ఏడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో మెకింటోష్ 200 మీటర్ల బటర్‌ఫ్లయ్, మెడ్లీ, 400 మీటర్ల మెడ్లీ ఈవెంట్స్‌లో స్వర్ణాలు గెలిచి, 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో రజతం సాధించింది.
2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం నెగ్గిన మెకింటోష్ ... 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు, రెండు కాంస్యాలు సాధించింది. మూడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్న మెకింటోష్ ఇప్పటి వరకు మొత్తం ఏడు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో కలిపి 11 పతకాలు గెలిచింది.
మరోవైపు పురుషుల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో ఫేవరెట్ లియోన్ మర్చండ్ స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. బుధవారం సెమీఫైనల్ రేసులో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన 23 ఏళ్ల మర్చండ్... గురువారం జరిగిన ఫైనల్ రేసును 1 నిమిషం 53.68 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో డేవిడ్ పొపోవిచి (రొమేనియా; 46.51 సెకన్లు)... మహిళల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో కేథరీన్ బెర్కోఫ్ (అమెరికా; 27.08 సెకన్లు) బంగారు పతకాలు గెలిచారు.
మహిళల 4–200 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో ఆస్ట్రేలియా బృందం స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. మరో మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ మెగా ఈవెంట్‌లో పతకాల పట్టికలో ఆస్ట్రేలియా (5 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలు) 11 పతకాలతో అగ్రస్థానంలో... అమెరికా (4 స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్యాలు) 18 పతకాలతో రెండో స్థానంలో... కెనడా (3 స్వర్ణాలు, 2 కాంస్యాలు) ఐదు పతకాలతో మూడో స్థానంలో ఉన్నాయి. గెలిచిన స్వర్ణాల సంఖ్య ఆధారంగా ర్యాంకింగ్‌ను నిర్ణయిస్తారు.