
మంగళవారం రాత్రి ఇక్కడా ఐపీఎల్ హంగామా
ట్యాంక్‌బండ్, సెక్రటేరియట్ మార్గాల్లో సంబరాలు
వారిని చెదరగొట్టేందుకు ఇబ్బందులుపడ్డ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం సన్మానం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కొందరు చనిపోగా, అనేక మంది క్షతగాత్రులయ్యారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోనూ ఇలాంటి ముప్పు తప్పింది.
బుధవారం రాత్రి ఆర్సీబీ (RCB) జట్టు ఐపీఎల్ కప్పు గెలిచిన వెంటనే ట్యాంక్‌బండ్, తెలుగు తల్లి చౌరస్తా, అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్‌లతో పాటు అనేక ప్రాంతాలు క్రికెట్ అభిమానులతో నిండిపోయాయి. ద్విచక్ర వాహనాలపై ఫీట్లు చేస్తూ యువకులు కేరింతలు కొట్టారు. రహదారులపై పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చారు.
ఎన్డీఆర్ మార్గ్, సచివాలయం, తెలుగుతల్లి చౌరస్తా ప్రాంతాల్లో కొందరు రెచ్చిపోయారు. అక్కడ ఆగిన వాహనాల పైకి ఎక్కి హంగామా చేశారు. ద్విచక్ర వాహనాల హారన్లు మోగిస్తూ, మితిమీరిన వేగంతో నడిపించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు (Police) వెంటనే అప్రమత్తమై అక్కడకు చేరుకున్నారు. ఉన్నతాధికారులు అదనపు బలగాలను ఆ ప్రాంతాలకు పంపారు. వీళ్లు అక్కడ ఉన్న యువకుల్ని చెదరగొట్టి పరిస్థితుల్ని చక్కదిద్దారు.