
సన్‌రైజర్స్ అనూహ్య పరాజయం
5 వికెట్లతో గెలిచిన లక్నో
చెలరేగిన పూరన్, మార్ష్
శార్దుల్ ఠాకూర్‌కు 4 వికెట్లు
ఉప్పల్ స్టేడియంలో మళ్లీ పరుగులు వరద పారింది. దాదాపు 400 పరుగులు కూడా నమోదయ్యాయి. కానీ ఫలితం మాత్రం పూర్తి భిన్నంగా వచ్చింది. ప్రతీసారి విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతూ ప్రత్యర్థిని ఊపిరాడకుండా చేసే సన్‌రైజర్స్ ఈసారి ఓటమి పక్షాన నిలిచింది.
బలహీన బౌలింగ్‌గా అనిపించిన లక్నో పట్టుదలగా ఆడి రైజర్స్‌ను 200 గీత దాటకుండా చేస్తే... ఆపై లక్నో బ్యాటర్లు పూరన్, మిచెల్ మార్ష్లు సన్‌రైజర్స్‌కు వారి బ్యాటింగ్ దెబ్బనే రుచి చూపించారు. ఫలితంగా హైదరాబాద్‌కు అనూహ్య ఓటమి ఎదురుకాగా... లక్నో గెలుపు బోణీ చేసింది. ఏడాది క్రితం ఇదే మైదానంలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న లక్నో టీమ్ ఇప్పుడు బదులు తీర్చుకుంది.
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు సొంతగడ్డపై తొలి పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (28 బంతుల్లో 47; 5 ఫోర్లు,3 సిక్స్‌లు), అనికేత్ వర్మ (13 బంతుల్లో 36; 5 సిక్స్‌లు), నితీశ్ కుమార్ రెడ్డి (28 బంతుల్లో 32; 2 ఫోర్లు) జట్టు ఇన్నింగ్స్‌లో కీలక పరుగులు సాధించారు.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శార్దుల్ ఠాకూర్ 34 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్నో 16.1 ఓవర్లలో 5 వికెట్లకు 193 పరుగులు చేసి గెలిచింది. నికోలస్ పూరన్ (26 బంతుల్లో 70; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 52; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 43 బంతుల్లోనే 116 పరుగులు జోడించారు.
అభిషేక్, ఇషాన్ విఫలం
సన్‌రైజర్స్‌కు ఈసారి సరైన ఆరంభం లభించలేదు. శార్దుల్ వరుస బంతుల్లో అభిషేక్ శర్మ (6), గత మ్యాచ్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్ (0)లను వెనక్కి పంపడంతో 15 పరుగులకే జట్టు 2 వికెట్లు కోల్పోయింది. అయితే హెడ్ మాత్రం తన జోరు తగ్గించలేదు. అవేశ్ ఓవర్లో అతను 2 సిక్స్‌లు, ఫోర్‌తో చెలరేగాడు. రవి బిష్ణోయ్ ఓవర్లో 35 పరుగుల వద్ద హెడ్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను పూరన్ వదిలేశాడు.
అదే ఓవర్లో బిష్ణోయ్ కూడా కఠినమైన మరో రిటర్న్ క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. అయితే దాని వల్ల ఎక్కువ నష్టం జరగలేదు. మరో 12 పరుగులు జోడించిన హెడ్‌ను ప్రిన్స్ యాదవ్ అద్భుత బంతితో క్లీన్»ౌల్డ్ చేశాడు. ప్రిన్స్‌కు ఐపీఎల్‌లో ఇది తొలి వికెట్ కావడం విశేషం. మరో ఎండ్‌లో బాగా తడబడిన నితీశ్ ధాటిగా ఆడటంలో విఫలమయ్యాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు దూకుడు ప్రదర్శించిన క్లాసెన్ (17 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు.
అయితే అనికేత్, ప్యాట్ కమిన్స్ (4 బంతుల్లో 18; 3 సిక్స్‌లు) సిక్సర్లు స్కోరును 200 పరుగులకు చేరువగా తెచ్చారు. బిష్ణోయ్ ఓవర్లో రెండు వరుస సిక్స్‌లు బాదిన అనికేత్...రాఠీ ఓవర్లోనూ వరుసగా రెండు సిక్సర్లతో చెలరేగాడు. అయితే తర్వాతి బంతికీ ఇదే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి అతను వెనుదిరిగాడు. చివరి 2 ఓవర్లలో కలిపి 10 పరుగులే చేయగలిగిన హైదరాబాద్ ఆఖరి 16 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా లేకపోవడం గమనార్హం.

మెరుపు భాగస్వామ్యం...
షమీ తన తొలి ఓవర్లో మార్క్‌రమ్ (1)ను అవుట్ చేసిన ఆనందం రైజర్స్ శిబిరంలో ఎంతోసేపు నిలవలేదు. అక్కడి నుంచి మార్ష్, పూరన్ కలిసి రైజర్స్ బౌలర్ల భరతం పట్టారు. సిమర్జీత్ ఓవర్లో పూరన్ ఫోర్, 2 సిక్స్‌లు బాదగా, షమీ ఓవర్లో మార్ష్ 2 సిక్స్‌లు కొట్టాడు. అభిషేక్ ఓవర్లో కూడా పూరన్ 2 సిక్స్‌లు కొట్టడంతో పవర్‌ప్లేలో లక్నో స్కోరు 77 పరుగులకు చేరింది. ఆ తర్వాత పూరన్ మరింత చెలరేగిపోయాడు.
18 బంతుల్లోనే ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పూరన్ అవుటైన తర్వాత 29 బంతుల్లో మార్ష్ అర్ధ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో బదోని (6), పంత్ (15) అవుటైనా... మిల్లర్ (13 నాటౌట్), సమద్ (8 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కలిసి విజయాన్ని పూర్తి చేశారు.
మూడు బంతులు, మూడు సిక్సర్లు...
సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ బ్యాటింగ్ ఆసక్తికరంగా సాగింది. తాను ఎదుర్కొన్న తొలి 3 బంతులను అతను సిక్సర్లుగా మలిచాడు. శార్దుల్ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన అతను, అవేశ్ ఓవర్లో తొలి బంతిని సిక్సర్ కొట్టి తర్వాతి బంతికే వెనుదిరిగాడు.
అనూహ్య రనౌట్...
టాప్–3 బ్యాటర్లు వెనుదిరిగిన తర్వాత రైజర్స్ ఆశలన్నీ క్లాసెన్‌పైనే ఉన్నాయి. అతనూ అప్పటికే చక్కటి షాట్లతో ధాటిని ప్రదర్శిస్తున్నాడు. అయితే ప్రిన్స్ యాదవ్ ఓవర్లో అతను రనౌట్ కావడం జట్టు తుది స్కోరుపై ప్రభావం చూపించింది. ప్రిన్స్ వేసిన బంతిని నితీశ్ బలంగా బాదగా బౌలర్ దానిని క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే అది విఫలం కాగా, బంతి చేతులను తాకి నాన్ స్ట్రయికింగ్ స్టంప్స్ వైపు వెళ్లింది. అప్పటికే పరుగు కోసం క్రీజ్ దాటిన క్లాసెన్ రనౌటవక తప్పలేదు.
ఎవరీ అనికేత్ వర్మ...?
ఐదు సిక్సర్లతో సన్‌రైజర్స్ అభిమానులను ఆకట్టుకున్న అనికేత్ వర్మ గత మ్యాచ్‌తోనే ఐపీఎల్‌లోకి అడుగు పెట్టాడు. రాజస్తాన్‌తో పోరులో తన రెండో బంతికే అతను సిక్స్ కొట్టాడు. ఐపీఎల్‌కు ముందు అతను సీనియర్ స్థాయిలో ఒకే ఒక టి20 మ్యాచ్ ఆడాడు. మధ్యప్రదేశ్ తరఫున బరిలోకి దిగిన అనికేత్ హైదరాబాద్‌తో జరిగిన ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లో తొలి బంతికే డకౌటయ్యాడు. అయితే అండర్–23 స్థాయి తన దూకుడైన ప్రదర్శనతో అతను అందరి దృష్టిలో పడ్డాడు.
దేశవాళీ అండర్–23 వన్డే టోర్నీలో 7 మ్యాచ్‌లలో 16 సిక్సర్లు బాదాడు. మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కూడా చెలరేగిన తీరును చూసి సన్‌రైజర్స్ వేలంలో కనీస విలువ రూ. 30 లక్షలకు అనికేత్‌ను తీసుకుంది. పుట్టింది ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోనే అయినా మెరుగైన అవకాశాల కోసం సరిహద్దు రాష్ట్రం మధ్యప్రదేశ్ చేరుకొని అక్కడే ఆటను మొదలు పెట్టాడు.
ఐపీఎల్‌లో నేడు
చెన్నై X బెంగళూరు
వేదిక: చెన్నై
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (బి) ప్రిన్స్ 47; అభిషేక్ (సి) పూరన్ (బి) శార్దుల్ 6; ఇషాన్ కిషన్ (సి) పంత్ (బి) శార్దుల్ 0; నితీశ్ రెడ్డి (బి) రవి బిష్ణోయ్ 32; క్లాసెన్ (రనౌట్) 26; అనికేత్ (సి) మిల్లర్ (బి) రాఠీ 36; అభినవ్ మనోహర్ (సి) సమద్ (బి) శార్దుల్ 2; కమిన్స్ (సి) రాఠీ (బి) అవేశ్ 18; హర్షల్ (నాటౌట్) 12; షమీ (సి) బదోని (బి) శారుŠద్‌ల్ 1; సిమర్జీత్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–15, 2–15, 3–76, 4–110, 5–128, 6–156, 7–156, 8–176, 9–181. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 4–0–34–4, అవేశ్ ఖాన్ 4–0–45–1, దిగ్వేశ్ రాఠీ 4–0–40–1, రవి బిష్ణోయ్ 4–0–42–1, ప్రిన్స్ యాదవ్ 4–0–29–1.
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) నితీశ్ రెడ్డి (బి) కమిన్స్ 52; మార్క్‌రమ్ (సి) కమిన్స్ (బి) షమీ 1; పూరన్ (ఎల్బీ) (బి) కమిన్స్ 70; పంత్ (సి) షమీ (బి) హర్షల్ 15; బదోని (సి) హర్షల్ (బి) జంపా 6; మిల్లర్ (నాటౌట్) 13; సమద్ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (16.1 ఓవర్లలో 5 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–4, 2–120, 3–138, 4–154, 5–164. బౌలింగ్: అభిషేక్ శర్మ 2–0–20–0, షమీ 3–0–37–1, సిమర్జీత్ సింగ్ 2–0–28–0, కమిన్స్ 3–0–29–2, ఆడమ్ జంపా 4–0–46–1, హర్షల్ పటేల్ 2–0–28–1, ఇషాన్ కిషన్ 0.1–0–4–0.