అభిషేక్ శర్మ- ఇషాన్ కిషన్ (PC: SRH/BCCI)
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తా చాటి టీమిండియాలోకి వచ్చిన ఆటగాళ్లలో అభిషేక్ శర్మ ముందు వరుసలో ఉంటాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 2019 నుంచి జట్టుతో కొనసాగుతున్నాడు. సన్‌రైజర్స్ ఓపెనర్‌గా సత్తా చాటుతూ అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన అభిషేక్ శర్మ.. పొట్టి ఫార్మాట్లో భారత ఓపెనర్‌గా జట్టులో పాతుకుపోయాడు.
హైదరాబాద్ జట్టును వీడనున్నాడంటూ..
ప్రపంచ నంబర్ వన్ ఆటగాడిగా ఎదిగిన అభిషేక్.. ఫాస్టెస్ట్ రికార్డులకు పెట్టింది పేరు. అయితే, ఈ స్టార్ బ్యాటర్ త్వరలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును వీడనున్నాడంటూ ఇటీవల వదంతులు వ్యాపించాయి. కెప్టెన్సీ విషయంలో తలెత్తిన విభేదాల కారణంగా ఈ పంజాబ్ ఆటగాడు యాజమాన్యం పట్ల అసంతృప్తితో ఉన్నాడని వాటి సారాంశం.
అందుకే విభేదాలు?
ముఖ్యంగా టీమిండియా మరో స్టార్, ప్రస్తుత వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను భవిష్య కెప్టెన్‌గా అభిషేక్ అంగీకరించలేకపోతున్నాడని.. తనకే పగ్గాలు ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటుగా స్పందించాడు.
ఎవరికి పడితే వాళ్లకే ఇస్తారా?
‘‘అభిషేక్ శర్మ ఎక్కడికి వెళ్తాడు?.. ప్రస్తుతం ఏ ఐపీఎల్ జట్టులోనూ కెప్టెన్‌గా అతడికి స్థానం లేదు. సన్‌రైజర్స్ వల్లే అతడొక బ్రాండ్‌గా ఎదిగిన మాట వాస్తవం. ఇక ఇషాన్ కిషన్ ఇప్పటికే కెప్టెన్‌గా, నిలకైడన బ్యాటర్‌గా తనను తాను నిరూపించుకున్నాడు.
స్వతహాగా మంచి ఆటగాడు కాబట్టే.. కెప్టెన్‌గానూ అద్భుతంగా రాణించగలిగాడు. ఎవరికి పడితే వారికి ఇవ్వడానికి కెప్టెన్సీ ఏమీ లడ్డూ కాదు. తాను కెప్టెన్సీ మెటీరియల్ అని సదరు ఆటగాడు నిరూపించుకుంటే పగ్గాలు వాటంతటవే చేతికి వస్తాయి. ఇషాన్ కిషన్ తన సొంత జట్టు జార్ఖండ్ సారథిగా.. దులిప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరించి టైటిళ్లు అందించాడు.
అత్యుత్తమ ఓపెనరే.. కానీ
ఇక అభిషేక్ శర్మకు కెప్టెన్‌గా ప్రస్తుతానికి ఎక్కడా అవకాశాలు లేవు. ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ స్థానంలో అభిషేక్‌ను ఓపెనర్‌గా తీసుకుంటుందేమో గానీ.. కెప్టెన్సీ మాత్రం ఇవ్వదు. ఆటగాడిగా అభిషేక్ ఎక్కడైనా నిలదొక్కుకోగలడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఓపెనర్లలో ప్రస్తుతం అతడూ ఒకడు. కానీ కెప్టెన్‌గా అవకాశం రాకపోవచ్చు.
మూర్ఖపు ఆలోచన పక్కనపెట్టు
ఒకవేళ నిజంగానే ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ ఇచ్చినా అభిషేక్ సన్‌రైజర్స్‌లో సీనియర్ ఆటగాడిగా గౌరవప్రదమైన హోదాలోనే ఉంటాడు. జట్టులో అతడి మాట కూడా చెల్లుతుంది. కాబట్టి ఎస్‌ఆర్‌హెచ్‌ను వీడాలనే మూర్ఖపు ఆలోచన పక్కనపెట్టాలని నేను అభిషేక్‌కు సలహా ఇస్తున్నా.
హైదరాబాద్‌లో నీకు మంచి పిచ్ దొరికింది. నీకోసమే అలాంటి వికెట్లు తయారు చేస్తారు. వేరే ఏ చోట అయినా అభిషేక్ ఈ స్థాయిలో పరుగులు రాబట్టలేడు. కాబట్టి అతడు ఎస్‌ఆర్‌హెచ్‌తో ఉంటేనే మేలు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ అభిషేక్ శర్మకు హితవు పలికాడు.
కమిన్స్ సారథ్యంలో
కాగా ప్రస్తుతం సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా దిగ్గజ సారథి ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. అతడి నాయకత్వంలో హైదరాబాద్ జట్టు 2024లో ఫైనల్ చేరింది. అయితే, గతేడాది ఆరో స్థానంతోనే సరిపెట్టుకుంది. ఈ ఏడాది కమిన్స్ గైర్హాజరీలో ఇషాన్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించి ఏడింట నాలుగు మ్యాచ్‌లు గెలిపించాడు. ఇక జట్టు ప్లే ఆఫ్స్ కూడా చేరింది.
ఇదిలా ఉంటే.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ నాయకుడిగా వ్యవహరించిన ఇషాన్.. జట్టును చాంపియన్‌గా నిలిపాడు. ఇటీవల రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ సారథిగా వ్యవహరించి.. జట్టుకు ట్రోఫీ అందించాడు.
ఇవీ చదవండి: జట్టును వీడిపోండి.. లేదంటే రిటైర్ అవ్వండి: యువీ, గంభీర్ కెరీర్లు అలా ఖతం
‘క్రికెటర్లు బాగా సంపాదిస్తారు.. కానీ వాళ్లంతా పిసినిగొట్టోళ్లు’: రోహిత్ శర్మ


