
ఐపీఎల్-2025లో లక్నోసూపర్ జెయింట్స్ ఎట్టకేలకు మరో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన లక్నో.. టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌కు చెక్ పెట్టింది. గుజరాత్ జట్టును 33 పరుగుల తేడాతో మట్టికరిపించింది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 202 పరుగులకు పరిమితమైంది. లక్నో విజయంపై కెప్టెన్ రిషబ్ పంత్ ఆనందం వ్యక్తం చేశాడు.
మ్యాచ్ ముగిసిన అనంతరం, లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. విజయం పట్ల కచ్చితంగా సంతోషంగా ఉంది. ఓ జట్టుగా మేము మంచి క్రికెట్ ఆడగలమని నిరూపించాం. టోర్నమెంట్‌లో మాకు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశాలు ఒకప్పుడు ఉన్నాయి. ఇప్పుడు గెలిచినా రేసులో లేము. కానీ అది ఆటలో భాగం. ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. టాప్ త్రీలో చోటు సంపాదించడం ఎప్పుడూ సులభం కాదు. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్‌లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఫీల్డింగ్‌లో కొన్ని తప్పిదాలు చేశాం. మరికొంత మెరుగు కావాల్సి అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.
గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ ఓటమి ద్వారా జట్టులో కొన్ని లోపాలు, సానుకూల అంశాలను తెలుసుకున్నాం. పవర్‌ప్లేలో మేము బాగా బౌలింగ్ చేశాం. కానీ, అనుకున్న ప్రకారం వికెట్టు సాధించలేకపోయాం. మా బౌలర్లు భారీగా పరుగులిచ్చారు. 15-20 పరుగులు అదనంగా ఇచ్చాం. వారిని 210 దగ్గర ఆపాలనుకున్నాము. 210కి 230 మధ్య భారీ తేడా ఉంటుంది. 240 పరుగులను ఛేదించడం ఎప్పుడూ సులభం కాదు. రూథర్‌ఫోర్డ్, షారుఖ్ బ్యాటింగ్ మాకు పెద్ద పాజిటివ్ అంశం. ప్లేఆఫ్‌లోకి వెళ్లే క్రమంలో మళ్లీ పుంజుకుని విజయం సాధిస్తామని తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (117; 64 బంతుల్లో 10×4, 8×6) మెరుపు శతకం సాధించడంతో ఎల్‌ఎస్‌జీ 2 వికెట్లకు 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. నికోలస్ పూరన్ (56 నాటౌట్; 27 బంతుల్లో 4×4, 5×6), మార్‌క్రమ్ (36; 24 బంతుల్లో 3×4, 2×6) కూడా రాణించారు. అనంతరం ఛేదనలో గుజరాత్ 9 వికెట్లకు 202 పరుగులే చేయగలిగింది. షారుఖ్ ఖాన్ (57; 29 బంతుల్లో 5×4, 3×6) టాప్‌స్కోరర్. ఎల్‌ఎస్‌జీ బౌలర్లలో ఒరూర్క్ (3/27), ఆయుష్ బదోని (2/4) రాణించారు. 13 మ్యాచ్‌ల్లో గుజరాత్‌కిది 4వ ఓటమి కాగా.. లక్నో ఆరో విజయం నమోదు చేసింది. ఈ సీజన్లో నిలకడకు మారుపేరుగా నిలిచిన సాయి సుదర్శన్ (21) ఇన్నింగ్స్‌ను మెరుగ్గానే ఆరంభించినా ఎక్కువసేపు నిలవలేకపోయాడు.