విండీస్‌తో రెండో టెస్ట్‌.. భారీ రికార్డుపై కన్నేసిన రాహుల్‌, జడేజా | IND vs WI 2nd Test: KL Rahul, Ravindra Jadeja Eye 4000-Test Run Milestone in Delhi | Sakshi
Sakshi News home page

విండీస్‌తో రెండో టెస్ట్‌.. భారీ రికార్డుపై కన్నేసిన రాహుల్‌, జడేజా

Oct 7 2025 11:07 AM | Updated on Oct 7 2025 11:35 AM

KL Rahul and Jadeja on the verge of scaling huge milestones ahead of 2nd Test vs WI

అక్టోబర్‌ 10 నుంచి ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగబోయే రెండో టెస్ట్‌ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్‌ ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌ (KL Rahul), రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఓ భారీ రికార్డుపై కన్నేశారు. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ 111 పరుగులు, జడేజా 10 పరుగులు చేస్తే టెస్ట్‌ల్లో అరుదైన 4000 పరుగుల మైలురాయిని తాకుతారు.

ప్రస్తుతం రాహుల్‌ 64 టెస్ట్‌ల్లో 11 సెంచరీలు, 19 అర్ద సెంచరీల సాయంతో 36.01 సగటున 3889 పరుగులు చేయగా.. జడేజా 86 టెస్ట్‌ల్లో 6 సెంచరీలు, 27 హాఫ్‌ సెంచరీల సాయంతో 38.74 సగటున 3990 పరుగులు చేశాడు. రాహుల్‌తో పోలిస్తే జడేజాకు ఈ రికార్డును అందుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎందుకంటే అతను మరో 10 పరుగులు చేస్తే 4000 పరుగుల మైలురాయిని తాకుతాడు.

ప్రస్తుతం రాహుల్‌ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే.. ఇతనికి కూడా ఇదే టెస్ట్‌లో ఈ రికార్డును అందుకునే అవకాశాలు ఉన్నాయి. గత కొంతకాలంగా రాహుల్‌ 50 సగటుకు దగ్గరగా పరుగులు సాధిస్తున్నాడు. ఈ లెక్కన రాహుల్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్‌ సెంచరీలు చేసినా ఇదే టెస్ట్‌లో 4000 పరుగుల మైలురాయిని తాకవచ్చు.

భారత్‌ తరఫున ఇప్పటివరకు 17 మంది టెస్ట్‌ల్లో 4000 పరుగుల మైలురాయిని తాకారు. ప్రస్తుత భారత జట్టులో ఈ విభాగానికి సంబంధించి రాహుల్‌, జడేజాకు దగ్గర్లో ఎవ్వరూ లేరు. రిషబ్‌ పంత్‌ ఒక్కడే 3000 పరుగుల (3427) పరిధిలో ఉన్నాడు.

ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా విండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ 140 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో  కేఎల్‌ రాహుల్‌ (100), రవీంద్ర జడేజా (104 నాటౌట్‌) శతకాలు చేశారు. వీరితో పాటు రిషబ్‌ పంత్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన ధృవ్‌ జురెల్‌ (125) కూడా శతక్కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 162, రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకు కుప్పకూలింది. భారత్‌.. రాహుల్‌, జురెల్‌, జడ్డూ శతకాలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. 

ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు కూడా సత్తా చాటారు. సిరాజ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీయగా.. బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో 3, కుల్దీప్‌ తొలి ఇన్నింగ్స్‌లో 2, రెండో ఇన్నింగ్స్‌లో 2, వాషింగ్టన్‌ సుందర్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో తలో వికెట్‌, జడేజా రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. 

చదవండి: IND vs AUS: చెలరేగిన భారత బౌలర్లు.. వైభవ్‌ సూర్యవంశీ స్కోర్‌ ఎంతంటే..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement