
మాడ్రిడ్: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నమెంట్‌లో భారత జోడీ వెన్నం జ్యోతి సురేఖ–రిషభ్ యాదవ్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. కాంపౌండ్ విభాగం క్వాలిఫయింగ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్), రిషభ్ యాదవ్ (హరియాణా) ద్వయం 1431 పాయింట్లు స్కోరు చేసింది.
తద్వారా 2023 యూరోపియన్ గేమ్స్‌లో 1429 పాయింట్లతో టాంజా జెలెన్‌థియెన్–మథియాస్ ఫులర్టన్ (డెన్మార్క్) నెలకొల్పిన ప్రపంచ రికార్డును సురేఖ–రిషభ్ ద్వయం బద్దలు కొట్టింది. మహిళల క్వాలిఫయింగ్‌లో జ్యోతి సురేఖ 715 పాయింట్లు ... పురుషుల క్వాలిఫయింగ్‌లో రిషభ్ 716 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు.
ఫైనల్లో సురేఖ బృందం
జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, ప్రీతికలతో కూడిన భారత మహిళల జట్టు కాంపౌండ్ టీమ్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వాలిఫయింగ్‌లో భారత జట్టు 2116 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు ‘బై’ పొందింది. క్వార్టర్ ఫైనల్లో సురేఖ బృందం 235–226తో ఎల్ సాల్వడోర్ జట్టుపై... సెమీఫైనల్లో 230–226తో ఇండోనేసియాపై గెలిచింది.