జై ముంద్రా (PC: Ireland Cricket)
నమీబియాతో నాలుగో వన్డేలో ఐర్లాండ్ బౌలర్ జై ముంద్రా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. టాపార్డర్‌ను గడగడలాడించిన ఈ ఎడమచేతి వాటం పేసర్.. పట్టుదలగా నిలబడ్డ లోయర్ ఆర్డర్‌నూ కుదేలు చేశాడు. తద్వారా ఐర్లాండ్ భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
కాగా ఐదు వన్డేలు ఆడేందుకు ఐర్లాండ్ క్రికెట్ జట్టు నమీబియా పర్యటనకు వెళ్లింది. విండ్‌హాక్ వేదికగా జరుగుతున్న ఈ సిరీస్‌లో తొలుత ఐర్లాండ్ గెలవగా.. రెండు, మూడో వన్డేల్లో విజయం సాధించి ఆతిథ్య నమీబియా ముందడుగు వేసింది.
తప్పక గెలవాల్సిన పరిస్థితి
ఈ క్రమంలో పోటీలో నిలవాలంటే ఐర్లాండ్ నాలుగో వన్డేలో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నమీబియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఐర్లాండ్ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 298 పరుగుల మేర మెరుగైన స్కోరు నమోదు చేసింది.
ఓపెనర్ టిమ్ టెక్టార్ (73), కర్టిస్ కాంఫర్ (66) అర్ధ శతకాలు సాధించగా.. జార్జ్ డాక్రెల్ 47 పరుగులతో రాణించాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన నమీబియాకు జై ముంద్రా ఆది నుంచే చుక్కలు చూపించాడు.
ఆరు వికెట్లతో చెలరేగిన ముంద్రా
టాపార్డర్‌లో ఓపెనర్లలో మలాన్ క్రూగర్‌ను డకౌట్ చేసిన ముంద్రా.. లారెన్ స్టీన్‌కాంప్‌ను 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన జాన్ ఫ్రైలింక్‌ను 4 పరుగులకే పరిమితం చేశాడు.
అదే విధంగా.. వికెట్ కీపర్ బ్యాటర్ గ్రీన్ (45)ను బౌల్డ్ చేసిన ముంద్రా.. తొమ్మిదో స్థానంలో వచ్చి 40 పరుగులతో జోరు కనబరిచిన రూబెన్ ట్రంపెల్‌మ్యాన్‌ను కూడా బౌల్డ్ చేశాడు. ఆఖర్లో జాక్ బ్రాసెల్ (11) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా ముంద్రా మొత్తంగా ఆరు వికెట్లతో చెలరేగగా.. జోర్డాన్ నీల్, లియామ్ మెకార్తి, కర్టిస్ కాంఫర్, మాథ్యూ హాంఫ్రేస్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
168 పరుగులకే ఆలౌట్
ఫలితంగా నమీబియా 41 ఓవర్లలో కేవలం 168 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో ఐర్లాండ్ ఏకంగా 130 పరుగుల తేడాతో జయభేరి మోగించి.. సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఇక నమీబియాతో నాలుగో వన్డేలో జై ముంద్రా మొత్తంగా పది ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 26 పరుగులే ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు.
ఈ క్రమంలో ఐర్లాండ్ తరఫున వన్డే (అంతర్జాతీయ క్రికెట్)లలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా జై ముంద్రా చరిత్రకెక్కాడు. గతంలో ఈ రికార్డు జోష్ లిటిల్ పేరిట ఉండేది. కాగా జై ముంద్రా ఇటీవల టీమిండియాతో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
ఈ సిరీస్‌లో అనూహ్య రీతిలో చెలరేగి ఐర్లాండ్.. కనీవినీ ఎరుగని రీతిలో టీమిండియాను 2-0తో క్లీన్‌స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా జై ముంద్రా రాజస్తాన్‌లో జన్మించాడు. ఉన్నత విద్య కోసం ఐర్లాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డ ముంద్రా.. ఆ దేశ జాతీయ జట్టు తరఫున అదరగొడుతున్నాడు.
వన్డేల్లో ఐర్లాండ్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు
జై ముంద్రా- 6/26 (10)- 2026లో విండ్‌హాక్ వేదికగా నమీబియా మీద
జోష్ లిటిల్- 6/36 (10)- 2023లో హరారే వేదికగా జింబాబ్వే మీద
పాల్ స్టిర్లింగ్- 6/55 (10)- 2017లో గ్రేటర్ నోయిడా వేదికగా అఫ్గానిస్తాన్ మీద.
ఇదీ చదవండి: అభిషేక్, వైభవ్‌లకు అన్యాయం చేసినట్లే అవుతుంది: యువీ


